Maruti Suzuki | కరోనా మహమ్మారి తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంతకుముందు ఎంట్రీ లెవల్ కార్ల కొనుగోలుకు మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు కార్ల కొనుగోళ్లలో ప్రియారిటీలు మారిపోయాయి. ఎస్యూవీ కార్లపై మోజు రోజు రోజుకు పెరుగుతోంది. కానీ, దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మాత్రం ఇప్పటికీ బుల్లి కార్లకు గణనీయ మార్కెట్ ఉందని నమ్ముతోంది. ఎంట్రీ లెవల్ కార్లలో మారుతి వాటా 90 శాతం పైనే. అందుకే ఎంట్రీ లెవల్ కార్లతోపాటు కంపాక్ట్ సెడాన్ కార్ల ఆవిష్కరణపైనే కేంద్రీకరించింది.
ఈ ఏడాది న్యూ జనరేషన్ సెలేరియో, ఆల్టో కే10 మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన మారుతి సుజుకి.. 2024లో హ్యాచ్‌బ్యాక్, కంపాక్ట్ సెడాన్లను ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నది. న్యూ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్, డిజైర్ కంపాక్ట్ సెడాన్ కార్లను తీసుకొస్తున్నది. మైలేజీతోపాటు హైబ్రీడ్ టెక్నాలజీ కార్లతో మార్కెట్ వాటాను కొల్లగొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
ఏడాది తర్వాత మార్కెట్లోకి వచ్చే స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ , డిజైర్ కంపాక్ట్ సెడాన్ కార్లు 1.2 లీటర్లతోపాటు 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో డిజైన్ చేస్తున్నది. టయోటా హైబ్రీడ్ టెక్నాలజీని ఈ కార్లలో వినియోగిస్తున్నది. ఇటీవలే మార్కెట్లోకి తెచ్చిన గ్రాండ్ విటారా.. మారుతి తీసుకొచ్చిన తొలి హైబ్రీడ్ టెక్నాలజీ కారు. న్యూ స్విఫ్ట్, న్యూ డిజైర్ కార్లు లీటర్‌కు 35-40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయని తెలుస్తున్నది.
అంతా అనుకున్నట్లు జరిగితే దేశంలోనేఈ రెండు మోడల్ కార్లు అత్యంత ఫ్యూయల్ ఎఫిషియెంట్ వెహికల్స్‌గా నిలుస్తాయి. దీంతోపాటు న్యూ స్విఫ్ట్, డిజైర్ కార్లు.. కేఫ్-2 (కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ) ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్నాయి.
ప్రస్తుతం మారుతి సుజుకి స్విఫ్ట్, డిజైర్ 1.2 లీటర్లు, 4-సిలిండర్ కే12ఎన్ డ్యుయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో లభ్యం అవుతున్నాయి. 90బీహెచ్పీ పవర్, 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తాయి. 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌తో వస్తుననాయి. మాన్యువల్ వర్షన్ వేరియంట్ కారు లీటర్‌పై 23.30 కి.మీ., ఆటోమేటిక్ వర్షన్ కారు లీటర్‌పై 21.12 కి.మీ. మైలేజీ ఇస్తున్నాయి. రెండు కార్లు సీఎన్జీ ఫ్యూయల్ ఆప్షన్లోనూ లభిస్తున్నాయి.
ఇప్పుడు స్విఫ్ట్ రూ.5.92-8.85 లక్షల మధ్య, డిజైర్ రూ.6.24-9.18 లక్షల మధ్య లభిస్తున్నాయి. 2024 స్విఫ్ట్, డిజైర్ కార్లు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు అధికంగా పలికే అవకాశం ఉంది. న్యూ జనరేషన్ స్విఫ్ట్, డిజైర్ కార్లలోని ఫీచర్లు త్వరలో వెలుగు చూస్తాయని భావిస్తున్నారు.