Tech Jobs – TEAM LEASE | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 లక్షల మంది ఇంజినీర్లలో పది శాతం.. అంటే 1.50 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తున్నారు. అధిక ధరల నేపథ్యంలో కొనసాగుతున్న అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావంతో గతేడాదితో పోలిస్తే ఐటీ కంపెనీలన్నీ ఫ్రెష్ నియామకాలు 35-40 శాతం తగ్గించేశాయని ఓ అధ్యయనం తెలిపింది. 2022-23లో 2.3 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు పొందితే.. ఈ ఏడాది 1.6 లక్షల మందికే ఉద్యోగాలొస్తాయని టెక్ స్టాఫింగ్ అండ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ టీం లీజ్ డిజిటల్ నివేదించింది. ఇది ప్రీ-కరోనా నాటి పరిస్థితులకు దారి తీస్తుందని పేర్కొంది.
కొత్త ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి బదులు ఏడేండ్ల నుంచి 12 ఏండ్ల లోపు మధ్య శ్రేణి ఉద్యోగుల నియామకానికి ఐటీ, టెక్నాలజీ కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయని టీం లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ కృష్ణ విజ్ చెప్పారు. ఫ్రెషర్లకు ఆరు నెలలు శిక్షణ ఇవ్వడానికి బదులు ఎక్స్పీరియన్స్ గల వారితో బెటరని కంపెనీలు అంచనా వేస్తున్నాయన్నారు.
కరోనా మహమ్మారి ప్రభావం నేపథ్యంలో 2021-22లో ఐటీ, టెక్నాలజీతోపాటు వివిధ రంగాల వ్యాపార సంస్థలు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా అడుగులేశాయి. దీంతో నాలుగు లక్షల మంది కొత్త వారిని నియమించుకున్నారు. దీనికితోడు టెక్ ప్రొఫెషనల్స్ 30 శాతం అట్రిక్షన్ అయ్యారు. గతంతో పోలిస్తే ఇప్పుడు అట్రిక్షన్లు 16-18 శాతానికి పడిపోయాయి. అమెరికా టెక్ దిగ్గజాలు సామూహిక లేఆఫ్స్ ప్రకటించడంతో దేశీయంగా ‘టాలెంట్ పూల్’ ప్రవాహం ఎగిసి పడుతున్నది.
అదే సమయంలో వివిధ కంపెనీల గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ), బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), మీడియా, రిటైల్ అండ్ కన్జూమర్ బిజినెస్, లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్, ఇంజినీరింగ్ ఆర్ అండ్ డీ రంగాల్లో ఆల్టర్నేటివ్ ఉపాధి కల్పనా రంగాలుగా ఉన్నాయన్నారు కృష్ణ విజ్. మొత్తం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో సుమారు 45 శాతం మంది మాత్రమే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ ప్రొఫిషియెన్సీ ఉంటుందన్నారు.