Jeep Compass Night Eagle | అమెరికా కార్ల తయారీ సంస్థ ‘జీప్’.. భారత్ మార్కెట్లో అత్యంత పాపులర్ ఎస్యూవీ ‘కంపాస్’ నైట్ ఈగల్ ఎడిషన్ రీలాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.25.04 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. భారత్ లో పరిమిత యూనిట్లు మాత్రమే విక్రయిస్తామని జీప్ ప్రకటించింది. కంపాస్ నైట్ ఈగల్ మోడల్ కార్ల ప్రేమికులు కంపెనీ అధికారిక వెబ్ సైట్, సమీప డీలర్ల వద్ద కారు బుక్ చేసుకోవాలని తెలిపింది. అడాస్ తరహా సేఫ్టీ ఫీచర్లతో లీటర్ పెట్రోల్ పై 17.1 కి.మీ మైలేజీ అందిస్తున్నది.
తొలుత కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ కారును 2020లో, 2022లో రెండోసారి మార్కెట్లో ఆవిష్కరించారు. టాటా హారియర్ డార్క్ ఎడిషన్, ఎంజీ హెక్టార్ బ్లాక్ స్టోర్మ్, హ్యుండాయ్ టస్కన్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్, సిట్రోల్ సీ5 ఎయిర్ క్రాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ 700 వంటి కార్లతో జీప్ కంపాస్ నైట్ ఈగల్ మోడల్ పోటీ పడనున్నది. జీప్ కంపాస్ నైట్ ఈగల్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ మోడల్ కారు రూ.25.04 లక్షలు (ఎక్స్ షోరూమ్), ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కారు రూ.27.04 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
జీప్ కంపాస్ లాంగ్టిట్యూడ్ (ఓ) వేరియంట్ కారు ఆధారంగా నైట్ ఈగల్ ఎడిషన్ రూపుదిద్దుకున్నది. బ్లాక్ ఔట్ గ్రిల్లెపై గ్లోసీ బ్లాక్ ఫినిష్, డే లైట్ ఓపెనింగ్స్ (డీఎల్ఓ), ఫాగ్ లాంప్స్, రూఫ్ రెయిల్స్, సైడ్ ఫెండర్లపై బ్లాక్ బ్రాండింగ్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. బ్లాక్, వైట్, రెడ్ ఎక్స్టీరియర్ కలర్స్ లో లభిస్తుంది. ఫ్రంట్ ఎల్ఈడీ రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్స్, స్టాండర్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు జత కలిశాయి.
డోర్, సీట్ అప్హోల్స్టరీలపై బ్లాక్ ఇన్సర్ట్స్తోపాటు ఆల్ బ్లాక్ క్యాబిన్ థీంతో 2024 జీప్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ వస్తున్నది. డాష్ బోర్డుపై 10.1 అంగుళాల నెక్ట్స్ జనరేషన్ యూ-కనెక్టెడ్ 5 డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 10-అంగుళాల ఫ్రేమ్ లెస్ ఫుల్లీ కలర్డ్ డిజిటల్ టీఎఫ్టీ గాజ్ క్లస్టర్, రేర్ ఎంటర్ టైన్ మెంట్ స్క్రీన్, ఎయిర్ ఫ్యూరిఫయర్, బ్లూ అంబియెంట్ లైటింగ్, పనోరమిక్ సన్ రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ చార్జింగ్ పాడ్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.
జీప్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ కారు 2.0 లీటర్ల డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో చార్జ్ డ్ ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో వస్తున్నది. ఈ ఇంజిన్ 170 బీహెచ్పీ విద్యుత్, 350 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో వస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ఇంజిన్ లీటర్ డీజిల్ పై 17.1 కి.మీ మైలేజీ ఇస్తుంది. అన్ని ట్రిమ్స్ కార్లలో స్టాప్/స్టార్ట్ టెక్నాలజీ లభ్యం అవుతుంది. కేవలం 9.8 సెకన్లలో కారు 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, 4-చానెల్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రివర్స్ కెమెరా ఫర్ ప్యాసింజర్ సేఫ్టీ, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, రేర్ సీట్ బెల్ట్ రిమైండర్ అలర్ట్, రెయిన్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు అన్ని ట్రిమ్స్ కార్లలో లభ్యం అవుతాయి. 4-చానెల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ), అడ్వాన్స్డ్ బ్రేక్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆటో హోల్డ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఫీచర్లు కూడా ఉంటాయి.