Italy Bans ChatGPT | టెక్నాలజీపై కాస్త పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ చాట్‌జీపీటీ (ChatGPT) గురించే చర్చిస్తున్నారు. ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) టూల్ సాయంతో రూపుదిద్దుకున్న కంప్యూటర్ అప్లికేషన్ ఈ `చాట్‌జీపీటీ (ChatGPT)`. టెక్నాలజీ రంగంలోకి చాట్‌జీపీటీ ఎంట్రీపై సాంకేతిక రంగ నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాట్‌జీపీటీని ప్రపంచానికి పరిచయం చేసిన స్టార్టప్ సంస్థ `ఓపెన్ఏఐ` అడ్వాన్స్డ్ వర్షన్ జీపీటీ-4 తీసుకొచ్చింది. త్వరలో దీనికి అడ్వాన్స్డ్ వర్షన్ తీసుకొస్తామని చేసిన ప్రకటనపై ఎలన్‌మస్క్ మొదలు పలు టెక్నాలజీ రంగ నిపుణులు 1000 మంది పెదవి విరిచారు. తక్షణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత అత్యాధునిక చాట్‌జీపీటీ చాట్‌బోట్‌పై ఆవిష్కరణలు నిలిపేయాలని ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. లేదంటే అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకుని నియంత్రించాలని ఆ లేఖలో కోరారు.
ఈ తరుణంలో చాట్‌జీపీటీ అప్లికేషన్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్య దేశం ఇటలీ బ్యాన్ తెచ్చింది. తక్షణం ఈ నిషేధం అమల్లోకి తెస్తూ ఇటలీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇటలీలో చాట్‌జీపీటీ అప్లికేషన్ బ్లాక్ అయింది. ఈ చాట్‌జీపీటీని బ్యాన్ చేసిన తొలి ఈయూ దేశం ఇటలీ కావడం ఆసక్తికర పరిణామం.
తాము చాట్‌జీపీటీని బ్లాక్ చేస్తున్నట్లు ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ అధారిటీ శుక్రవారం తెలిపింది. ఈ అప్లికేషన్ తమ ప్రభుత్వ సమాచార భద్రతా నియంత్రణలకు లోబడి ఉంటుందా.. లేదా.. అనే అంశంపై దర్యాప్తు చేస్తామని పేర్కొంది. డేటా ఉల్లంఘనకు పాల్పడిన కేసు తమ దృష్టికి రావడంతో చాట్‌జీపీటీ వాడకంపై తమ దేశంలో నిషేధం విధించామని ఇటలీ తెలిపింది. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తరకొరియా దేశాలు చాట్‌జీపీటీని తమ దేశాల్లో బ్యాన్ చేశాయి. పౌరుల వ్యక్తిగత గోప్యత నిబంధనలను చాట్‌జీపీటీ ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తాత్కాలికంగా దీని వాడకంపై నిషేధం విధించామని ఇటలీ తెలిపింది.
గతేడాది నవంబర్‌లో ఏఐ ఆధారిత స్టార్టప్ కంపెనీ `ఓపెన్ ఏఐ` ఈ చాట్‌జీపీటీని ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చింది. టెక్నాలజీ రంగంలో ప్రపంచ దేశాలన్నింటా ఈ చాట్‌జీపీటీ ఎంతో ప్రజాదరణ సంపాదించుకుంది. దీంతో గ్లోబల్ టెక్ దిగ్గజాలన్నీ ఈ చాట్‌జీపీటీ అప్లికేషన్ తమకంటూ సొంతంగా తయారు చేయడంపై ఫోకస్ పెట్టాయి. ఓపెన్ ఏఐ సంస్థలో టెక్ జెయింట్ `మైక్రోసాఫ్ట్` భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.