Retail Inflation | టమాట వంటి కూరగాయల ధరలు భగ్గుమన్నా.. ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త రిలీఫ్ కల్పించింది. జూలైలో 7.44 శాతంతో 15 నెలల గరిష్ట స్థాయిని తాకిన రిటైల్ ద్రవ్యోల్బణం.. ఆగస్టులో 6.83 శాతానికి దిగి వచ్చింది. అయినా ఆర్బీఐ నియంత్రణ స్థాయికి పైనే నిలిచింది. జూలైలో 7.20 శాతంగా ఉన్న పట్టణ ద్రవ్యోల్బణం.. ఆగస్టులో 6.59 శాతానికి చేరుకున్నది. ఇక గ్రామీణ ద్రవ్యోల్బణం 7.63 శాతం నుంచి 7.02 శాతానికి తగ్గింది.
మొత్తం ద్రవ్యోల్బణంలో దాదాపు సగం వాటా గల ఆహార ద్రవ్యోల్బణం 11.51 నుంచి 9.94 శాతానికి దిగి వచ్చింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆహార వస్తువుల ధరలు ఎక్కువగా ఉండటం గత ఏడాది కాలంగా పాలకులకు ఇబ్బందికరంగా మారింది. కూరగాయలు, పాలు, తృణధాన్యాల దిగుబడి తగ్గడంతో సామాన్యుడి కష్టాలు పెరిగాయి.
గత జూలైలో ద్రవ్య పరపతి సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. ఇప్పటికీ ద్రవ్యోల్బణంలో అనిశ్చితి కొనసాగుతుందన్నారు. ఆర్బీఐ అంచనా ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం పొడవునా నాలుగు శాతానికి పైనే.. అంటే 5.1 నుంచి 5.4 శాతం మధ్య కొనసాగుతుండవచ్చునని భావిస్తున్నది.