5 లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. వరుసగా కొన్ని రోజులుగా లాభాల్లో మెరిసిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మదుపర్లను నష్టాలవైపు నడిపించాయి.
- భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు
- సెన్సెక్స్ 1,483, నిఫ్టీ 451 పాయింట్ల పతనం
- లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన మదుపర్లు
ముంబై, నవంబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. వరుసగా కొన్ని రోజులుగా లాభాల్లో మెరిసిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మదుపర్లను నష్టాలవైపు నడిపించాయి. ప్రారంభంలో లాభపడిన సూచీలకు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో చివరికి నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా రెండు రోజుల ర్యాలీ తర్వాత ఫైనాన్షియల్, బ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇరు సూచీలు రెండు శాతం వరకు పతనం చెందాయి. ఇంట్రాడేలో 1,500 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 83 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1,483.72 పాయింట్లు కోల్పోయి 82,435.99 వద్ద స్థిరపడింది.
దీంతో గడిచిన నాలుగు నెలల్లో ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 450.95 పాయింట్లు లేదా 1.75 శాతం పతనం చెంది 25,349.65 వద్ద ముగిసింది. జూలై 8 తర్వాత నిఫ్టీకి ఇదే అత్యంత భారీ నష్టం. ఏఐ సంబంధిత కంపెనీల విలువలపై ఆందోళనలతో అమెరికా, ఆసియా టెక్నాలజీ షేర్లను కేంద్రంగా చేసుకొని ప్రపంచ మార్కెట్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో మదుపర్లు రూ.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిస్టింగ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.508 లక్షల కోట్లకు పడిపోయింది.
పడేసిన టాటా స్టీల్
దేశీయ మార్కెట్లను ముంచింది బ్లూచిప్ సంస్థల షేర్లే. ప్రధానంగా టాటా స్టీల్ షేరు 8 శాతానికి పైగా పతనం చెందడం మదుపర్లలో ఆందోళనను పెంచింది. ఫలితంగా అమ్మకాల బటన్ నొక్కడంతో లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లిమిటెడ్‌లో ప్రమోటర్లకు ఉన్న మొత్తం 26.6 శాతం వాటాను రూ.15,510 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడంతో టాటా స్టీల్ పతనానికి కారణమైంది. పైప్స్, ట్యూబ్స్ తయారీ సంస్థలో మరో 26 శాతం వాటాను రూ.16,756 కోట్ల ఓపెన్ ఆఫర్ ద్వారా సొంతం చేసుకోవాలని టాటా స్టీల్ భావిస్తున్నది. ఈ సందర్భంగా వెల్త్ టెక్నాలజీ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఆర్ మాట్లాడుతూ.. సోమవారం భారత ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.
మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో వరుసగా నాలుగు వారాలుగా లాభాల్లో కదలాడిన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయని, ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ ఇటీవల నమోదుచేసిన రికార్డు గరిష్ఠాలు, నిఫ్టీ 26,000 స్థాయికి చేరువ కావడం తర్వాత పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో తొలుత ఎగువకు ప్రారంభమైన మార్కెట్ తిరోగమించిందన్నారు. ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు విదేశీ మదుపర్లు 13 బిలియన్ డాలర్ల వరకు దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు.
- టాటా స్టీల్ షేరు 8.16 శాతం పతనం చెంది టాప్ లూజర్‌గా నిలిచింది. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్‌ను సొంతం చేసుకోవడం మదుపర్లకు రుచించలేదు. దీంతో అమ్మకాలకు మొగ్గుచూపారు.
- అలాగే యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కో, ఎస్బీఐ, టీఎంపీవీ, కొటక్ బ్యాంక్, జియోఫిన్, ఎల్అండ్టీ, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్‌ఫైనాన్స్ షేర్లు
రెండు శాతానికి పైగా పతనం చెందాయి.
- కొల్ ఇండియా, టాటా కన్జ్యూమర్, రిలయన్స్, హెచ్‌యూఎల్, ట్రెంట్, నెస్లె, ఎన్టీపీసీ షేర్లు కూడా క్షీణించాయి.
- టీసీఎస్ షేరు 3.47 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది.
- దీంతోపాటు టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్, అపోలోహాస్పిటల్, విప్రో, ఐచర్మోటర్, ఐటీసీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ఇంధన ధరలు స్వల్పంగా పెరిగి 91 డాలర్ల పైకి చేరుకోవడం నష్టాన్ని పెంచింది.
- రంగాలవారీగా మెటల్ సూచీ అత్యధికంగా 4.17 శాతం నష్టపోగా..పీఎస్‌యూ బ్యాంకింగ్ 3.38 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.30 శాతం, కమోడిటీస్ 1.92 శాతం చొప్పున పతనం చెందాయి.
- కానీ, ఐటీ సూచీ 1.60 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ, ఆతిథ్య రంగ సూచీలు లాభపడ్డాయి.
- బీఎస్ఈలో 2,872 షేర్లు క్షీణించగా, 1,601 షేర్లు లాభపడ్డాయి. 265 షేర్లు మార్పు లేకుండా ముగిశాయి.
పతనానికి కారణాలు
- మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం
- వచ్చే నెలలో ఫెడ్ వడ్డీరేట్లు పెంచే అవకాశం
- బ్లూచిప్ సంస్థల షేర్లు మూడు శాతం క్షీణించాయి
- డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం
- అంతర్జాతీయ మార్కెట్లు భారీగా నష్టపోవడం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

