ఉరిమిన ఉత్సాహం
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. విదేశీ నిధుల ప్రవాహం, అంచనాలకన్నా మెరుగైన రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు, ముడి చమురు ధరలు నిలకడగా తగ్గుముఖం పట్టడం ఇందుకు దోహదపడ్డాయి.
- వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు
- సెన్సెక్స్ 773, నిఫ్టీ 210 పాయింట్లు వృద్ధి
- రూ.512 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
ముంబై, నవంబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. విదేశీ నిధుల ప్రవాహం, అంచనాలకన్నా మెరుగైన రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు, ముడి చమురు ధరలు నిలకడగా తగ్గుముఖం పట్టడం ఇందుకు దోహదపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 772.75 పాయింట్లు లేదా 0.95 శాతం పెరిగి 81,879.40 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 తర్వాత ఈ స్థాయిని సెన్సెక్స్ చేరడం ఇదే తొలిసారి. ట్రేడింగ్‌లో ఒక దశలో 1,413.75 పాయింట్లు లేదా 1.74 శాతం ఎగిసి 82,520.40కు చేరింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 210.40 పాయింట్లు లేదా 0.84 శాతం పెరిగి 25,255.05 దగ్గర ముగిసింది. ఇది కూడా దాదాపు తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయి. సెన్సెక్స్ కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రా 5.25 శాతం, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 4.37 శాతం, ట్రెంట్ 3.02 శాతం, టాటా స్టీల్ 2.22 శాతం, ఐటీసీ 2.15 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.14 శాతం చొప్పున పెరిగాయి. అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్ వెనుకబడ్డాయి.
ఎక్స్ఛేంజ్ గణాంకాల ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఎఫ్ఐలు) సోమవారం రూ.7,212.22 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్, వెల్త్‌టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ మాట్లాడుతూ.. ‘మూరత్ ట్రేడింగ్ సెషన్‌ను మినహాయిస్తే, భారత బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా తొమ్మిదో సాధారణ ట్రేడింగ్ సెషన్లోనూ లాభాలతో ముగిశాయి. ప్రారంభంలో గ్యాప్‌అప్‌తో వచ్చిన లాభాల్లో కొంత కోల్పోయినా, సూచీలు సానుకూల వేగాన్ని కొనసాగించగలిగాయి’ అని తెలిపారు.
‘డబ్ల్యూటీఐ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 86-87 అమెరికా డాలర్ల పరిధిలో తగ్గిన స్థాయిలోనే కొనసాగాయి. దీంతో దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతు లభించింది. ముడిచమురు ధరలు తగ్గడం, బాహ్య రంగ పరిస్థితులు మెరుగుపడటం వల్ల భారత రూపాయి కూడా నిలకడగా ఉన్నది’ అని పొన్ముడి అన్నారు. నిలకడగా కొనసాగుతున్న ఎఫ్ఐఐల పెట్టుబడులు, తక్కువ ముడిచమురు ధరలు, స్థిరమైన రూపాయి, ప్రోత్సాహకర కార్పొరేట్ ఆదాయాలు కలిసి విస్తృత మార్కెట్ పెరుగుదలకు మద్దతుగా నిలుస్తున్నాయని చెప్పారు. విస్తృత మార్కెట్లో బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 1.29 శాతం, మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 1.02 శాతం పెరిగాయి. రంగాలవారీగా.. మిడ్‌స్మాల్ ప్రైవేట్ బ్యాంక్స్ క్వాలిటీ టిల్ట్ 3.44 శాతం, పీఎస్‌యూ పీఎస్‌యూ బ్యాంక్ 3.03 శాతం, టెలికమ్యూనికేషన్ 2.41 శాతం, ఆటో 2.05 శాతం, బ్యాంకెక్స్ 1.94 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు ఐటీ, హెల్త్‌కేర్, రియల్టీ రంగాలు వెనుకబడ్డాయి.
రూ.38 లక్షల కోట్లు పైకి..
వరుస లాభాల నడుమ బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ వాల్యూ గత 8 రోజుల్లో రూ.38 లక్షల కోట్లు ఎగిసింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా మదుపర్ల సంపద దాదాపు రూ.512 లక్షల కోట్లకు పెరిగింది. ఇక ఈ రెండు రోజుల్లో పెట్టుబడిదారుల సంపద రూ.4.30 లక్షల కోట్లు పెరిగింది. రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్-రీసెర్చ్ అజిత్ మిశ్రా మాట్లాడుతూ.. ‘ప్రధాన కారణాల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల దూకుడు కొనుగోళ్లు కొనసాగడం ముఖ్యమైనది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 92-93 అమెరికా డాలర్ల సమీపంలో ఉన్నది. ఇటీవలి స్థాయిలతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడంతో దిగుమతుల వల్ల పెరిగే ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గాయి.
దేశీయ డిమాండ్, కార్పొరేట్ ఆదాయాలపై ఆశావహ దృక్పథంతోపాటు, కృత్రిమ మేధ (AI) ఆధారిత పెట్టుబడులపై ప్రపంచవ్యాప్త ఆసక్తి తగ్గడం భారత ఈక్విటీల ఆకర్షణను మరింత పెంచింది’ అని తెలిపారు. ప్రపంచ మార్కెట్లలో AI ప్రభావంతో అమ్మకాలు, బలమైన దేశీయ ఆదాయ వృద్ధి, భారీ కంపెనీల షేర్ల ఆకర్షణీయ విలువల కారణంగా రెండు నెలలు పెట్టుబడులు వెనక్కి వెళ్లిన తర్వాత విదేశీ పెట్టుబడిదారులు నవంబర్‌లో భారత ఈక్విటీల నికర కొనుగోలుదారులుగా మారారు. ఈ నెలలో ఇప్పటివరకు వారు రూ.53,739 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, షాంఘై సూచీలు లాభాల్లో ముగియగా, హాంకాంగ్ సూచీ నష్టాల్లో స్థిరపడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

