India E-Commerce ONDC | ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) అనే సంస్థను రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిందని ప్రభుత్వ వర్గాల కథనం. ఈ ఓపెన్ నెట్‌వర్క్‌లో భాగస్వాములయ్యేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు బారులు తీరాయని ఆ వర్గాలు తెలిపాయి. వివిధ వస్తువులు, సర్వీసుల కొనుగోలు కోసం తమ కస్టమర్లకు బయ్యర్ ప్లాట్‌ఫామ్స్ ఏర్పాటు చేయడంపై దేశంలోని అతి పెద్ద బ్యాంకులు సంప్రదింపులు జరుపుతున్నాయి. అన్ని రకాల ఆన్లైన్ సెల్లర్స్‌కు వస్తువులు, వివిధ రకాల సేవలు సమాన స్థాయిలో అందుబాటులో ఉంచడంతోనే ఓఎన్డీసీ విజయం ఆధారపడి ఉంటుంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మాదిరిగా సెల్లర్స్, బయ్యర్స్ బ్లాక్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఓఎన్డీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) టీ కోషీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బ్యాంకులు, వెంచర్ క్యాపిటలిస్టులు, టెలికం కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్లు కోషీ తెలిపారు. ఆయా సంస్థల పేర్లు, తన సంప్రదింపుల పురోగతిపై చర్చించడానికి నిరాకరించారు.
వచ్చే ఆగస్టు నాటికి కనీసం 100 నగరాలు, పట్టణాలకు సేవలను అందుబాటులోకి తేవాలని ఓఎన్డీసీ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఐదేండ్లలో 900 మిలియన్ల బయ్యర్లు, 1.2 మిలియన్ల మంది సెల్లర్లను సైన్అప్ చేసుకోవాలని ఓఎన్డీసీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఓఎన్డీసీతో చర్చలు జరుపుతున్న బ్యాంకుల్లో ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీబీఐ ఉన్నాయి. ఆయా బ్యాంకుల అధికారులు మాత్రం అధికారికంగా సంప్రదింపులపై స్పందించడానికి నిరాకరించారు.