Personal Loan | కొంత మంది ఎంత ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నా.. పొదుపు చేస్తున్నా.. అత్యవసరంగా నిధులు అవసరం అవుతుంటాయి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలు వస్తే తేలికైన రూట్ పర్సనల్ లోన్.. అలాగనీ వ్యక్తిగత రుణం అంత తేలిక్కాదు. గ్యారెంట్ లేకపోవడంతో పర్సనల్ లోన్ మీద ఎక్కువ వడ్డీ విధిస్తాయి బ్యాంకులు. ప్రతి వ్యక్తి క్రెడిట్ స్కోర్.. అంటే సిబిల్ స్కోర్‌ను బట్టి రుణం మంజూరవుతూ ఉంటుంది. అధిక సిబిల్ స్కోర్ ఉంటే.. ప్రీ-అప్రూవ్డ్ రుణాలివ్వడానికి బ్యాంకులు బారులు తీరుతుంటాయి.
సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ పాయింట్లు ఉన్న వారికి బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వడానికి సుముఖంగా ఉంటాయి బ్యాంకులు. క్రెడిట్ స్కోర్ అంత కంటే తక్కువగా ఉంటే, రుణ గ్రహీతలు డిఫాల్టర్లు.. రుణ ఎగవేతదారులు అవుతారని సందేహిస్తుంటాయి బ్యాంకులు. క్రెడిట్ స్కోర్ సరి చేసుకోవాలంటే కనీసం 9 నెలల టైం పడుతుంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో పర్సనల్ లోన్ ఇవ్వాల్సి వస్తే బ్యాంకులు అధిక వడ్డీరేట్లు వడ్డిస్తాయి. సిబిల్ (క్రెడిట్) స్కోర్ ఎక్కువగా ఉంటే, అత్యధిక బ్యాంకులు తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి బ్యాంకులు.. వ్యక్తిగత రుణాలు మంజూరు చేయడానికి ప్రాధాన్యం ఇస్తుంటాయి.
ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నా.. నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లింపులు వారి ఆదాయంలో 50 శాతం మించని వారికి మాత్రమే బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వడానికి మొగ్గు చూపుతుంటాయి. ఇప్పటికే ఉన్న ఈఎంఐలు, పర్సనల్ లోన్‌పై వాయిదాలు కలగలిపి గణిస్తే మొత్తం 50 శాతం దాటకుండా ఉంటేనే వ్యక్తిగత రుణం ఇస్తాయి బ్యాంకులు. ప్రతి ఒక్కరి నెలవారీ ఖర్చులు, ఈఎంఐలు, బీమా ప్రీమియం చెల్లింపులను పరిగణనలోకి తీసుకుని వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేస్తే మంచిదని ఆర్థిక వేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. నెలవారీ ఇంటి అద్దెల చెల్లింపులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు.
ఎవరూ ఏ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా, సంబంధిత వ్యక్తి క్రెడిట్ స్కోర్ ఎంత అన్నది సంబంధిత క్రెడిట్ బ్యూరోలను బ్యాంకులు సంప్రదిస్తాయి. ఒకసారి కంటే ఎక్కువ సార్లు లోన్ కోసం దరఖాస్తులు పెట్టుకున్నా సిబిల్ బ్యూరోలు తీవ్రంగా పరిగణిస్తాయి. వారి క్రెడిట్ స్కోర్ తగ్గించేస్తాయి. అంటే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే పర్సనల్ లోన్ ఆశలు తగ్గుతాయి.
ఒకవేళ కో-అప్లికెంట్లు ఉంటే వారికి బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వడానికి క్రెడిట్ రిస్క్ తగ్గుతూ ఉంటుంది. కో-అప్లికెంట్లు ఉండటం వల్ల సకాలంలో రుణ వాయిదాలు చెల్లిస్తారని బ్యాంకులకు నమ్మకం కలుగుతుంది. కనుక తక్కువ ఆదాయం, తక్కువ సిబిల్ స్కోర్, నిలకడ లేని ఉద్యోగం, సరిపోని రీపేమెంట్ సామర్థ్యం వంటి పరిస్థితులు ఉన్న వ్యక్తులు.. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్న కో-అప్లికెంట్‌ను తోడు తెచ్చుకుంటే పర్సనల్ లోన్ పొందే అర్హతలు ఎక్కువ అవుతాయి. లోన్ చెల్లింపులో కో-అప్లికెంట్ ఆదాయాన్ని కూడా బ్యాంకులు విశ్వాసంలోకి తీసుకుంటాయి.
సేవింగ్స్ అకౌంట్స్‌తోపాటు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే ఖాతాదారుల నిర్వహణ తీరు తెన్నులు బాగా ఉన్నా, వ్యక్తిగత రుణ పరపతి అవకాశాలు ఉంటాయి. బ్యాంకర్‌కు మంచి నమ్మకం దారుగా నిలుస్తారు. బ్యాంకు అధికారులతో సత్సంబంధాలు, ఖాతా నిర్వహణలో మెరుగ్గా ఉంటే తక్కువ వడ్డీరేటుకే వ్యక్తిగత రుణం మంజూరవుతుంది. బ్యాంకులు తమకు మంచి ఖాతాదారులు ఉండాలని కోరుకుంటాయి. కనుక బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు ఆచితూచి నిర్వహించడంతోపాటు బ్యాంకు అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.