హైబ్రిడ్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్. రకరకాల వేదికల్లో ఈ పెట్టుబడి వాహకాలు మదుపు చేస్తాయి. ప్రధానంగా ఈక్విటీలు (స్టాక్స్), ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల (బాండ్లు లేదా డెట్ మార్కెట్)లో ఇన్వెస్ట్ చేస్తాయి. స్థిరత్వంతో కూడిన వృద్ధిదాయక స్టాక్స్, రెగ్యులర్ ఇన్కమ్ బాండ్స్ లక్ష్యంగా వీటిని డిజైన్ చేశారు. తద్వారా ఇన్వెస్టర్లు రిస్క్‌ను బ్యాలెన్స్ చేయడానికి దోహదం చేయగలవు. వీటిలో రకాలను పరిశీలిస్తే..
అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్
పెట్టుబడుల్లో 65-80 శాతం ఈక్విటీల్లోకే వెళ్తాయి. మిగతావి డెట్ మార్కెట్లలోకి పోతాయి. ఒడిదుడుకులు స్వల్పం. దీర్ఘకాలిక వృద్ధికి అనువైనవి.
కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్
పెట్టుబడుల్లో 75-90 శాతం డెట్ మార్కెట్లలోకి వెళ్తాయి. మిగతా స్వల్ప మొత్తంలో ఈక్విటీ మార్కెట్లలో ట్రేడ్ అవుతాయి. రెగ్యులర్ ఇన్‌కమ్‌ను ఆశించేవారికి అనువైనవి.
బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్
మార్కెట్ వాల్యుయేషన్స్ ఆధారంగా ఈక్విటీ, డెట్ మార్కెట్ల నడుమ పెట్టుబడులు మారుతూ ఉంటాయి. తక్కువ ధరల్లో పెట్టుబడులు పెట్టడం, ఎక్కువ ధరల్లో లాభాలను స్వీకరించడం జరుగుతుంది.
మల్టీ అసెట్ అల్లోకేషన్ ఫండ్స్
స్టాక్ మార్కెట్లు, రుణ మార్కెట్లు, బంగారం లేదా రియల్ ఎస్టేట్ లక్ష్యంగా పెట్టుబడుల కేటాయింపు ఉంటుంది.
ప్రయోజనాలు..
వైవిధ్యం: అన్ని రకాల వేదికల్లో పెట్టుబడులుంటాయి కాబట్టి ఒడిదుడుకుల నుంచి మదుపర్లకు రక్షణ ఉంటుంది.
ఆటోమేటిక్ రీబ్యాలెన్స్: ఫండ్ మేనేజర్లు అసెట్ అల్లోకేషన్ను సర్దుబాటు చేస్తారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా క్రయవిక్రయాలను జరుపుతారు.
ఏకత్వంలో భిన్నత్వం: సింగిల్ పోర్ట్‌ఫోలియోలోనే ఈక్విటీ, డెట్ సెక్యూరిటీలు కలగలిసి ఉంటాయి. సంపద సృష్టిలో మదుపర్లకు సమాన అవకాశాలను కల్పిస్తాయి.