IT Returns | నోయిడా కేంద్రంగా సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలో సంజయ్ తోమర్ ఒక ఐటీ ప్రొఫెషనల్. ఆయన వేతన చెల్లింపులన్నీ ట్యాక్స్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ‘కొత్త ఐటీ పాలసీ’.. డిఫాల్ట్‌గా పెట్టింది కేంద్రం. కానీ పాత ఐటీ విధానంతో పోలిస్తే నూతన ఐటీ పాలసీలో చెప్పుకోదగ్గ పన్ను మినహాయింపులు ఉండవు. ఒకవేళ సంజయ్ తోమర్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో పాత ఐటీ పాలసీని ఎంచుకుంటే ప్రతిఏటా రూ.52 వేలకు పైగా ఆదాయం పన్ను ఆదా చేయగలడు. అదెలాగో తెలుసుకుందాం..!
ముందుగా సంజయ్ తోమర్ తాను పాత ఐటీ పాలసీలోనే ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తానని కంపెనీ యాజమాన్యానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తాను ఐటీ నిపుణుడైనా.. అద్దె ఇంటిలోనే నివసిస్తున్నాడు. తన పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ చెల్లిస్తున్నాడు. తన కుటుంబంతోపాటు తల్లికి కలిపి హెల్త్ బీమా పాలసీ తీసుకున్నాడు. ఇంటి అద్దె, పిల్లల విద్యాభ్యాస రుణం చెల్లింపులు, హెల్త్ బీమాలకు ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త ఐటీ పాలసీలో ఇవేవీ ఉండవు. ఆదాయం పన్ను చట్టం 80సీ సెక్షన్ కింద పూర్తిగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు క్లయిమ్ చేస్తే దాదాపు రూ.30 వేల పన్ను ఆదా అవుతుంది.
ఇక కంపెనీ యాజమాన్యం సంజయ్ తోమర్ కనీస వేతనంలో 10 శాతం ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీం) కింద కట్ చేయడంతో ప్రతి నెలా రూ.4,000 చొప్పున ఏటా రూ.48 వేలు పొదుపు అవుతుంది. దీనికి ఆదాయం పన్ను చట్టంలోని 80సీసీడీ (2) సెక్షన్ కింద రూ.10 వేల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆయన సొంతంగా ఏడాదికి మరో రూ.50 వేలు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు పెడుతున్నాడు. దీనికి ఆదాయం పన్ను చట్టంలోని 80సీసీడీ (1బీ) సెక్షన్ కింద రూ.10,400 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. దీనికి తోడు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ లో రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టాడు.
ప్రస్తుతం ఏటా రూ.4.80 లక్షల వేతనం అందుకుంటున్న సంజయ్ తోమర్‌కు కరవు భత్యం రూ.2.40 లక్షలు, స్పెషల్ అలవెన్స్ రూ.5,87,328, ఫ్యుయల్ రీయింబర్స్ మెంట్ రూ.40 వేలు, మీల్ కూపన్లు రూ.24 వేలు, దిన పత్రికలు, మ్యాగజైన్ల బిల్లు రూ.6000, టెలిఫోన్ రీయింబర్స్ మెంట్ రూ.18 వేలు, ఎల్‌టీఏ రూ.72 వేలు, పీఎఫ్ కోసం కంపెనీ యాజమాన్యం భాగస్వామ్యం రూ.21,600, ఎన్పీఎస్ కింద రూ.48 వేలతోపాటు బ్యాంకుల్లో వివిధ ఖాతాల వడ్డీ రూపేణా ఆదాయం రూ.6,000 కలుపుకుంటే సంజయ్ తోమర్ ఏటా సంపాదిస్తున్న ఆదాయం రూ.15,52,928.
మొత్తం ఆదాయంలో ప్రావిడెండ్ ఫండ్ రూ.21,600, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ఎస్ఎస్) డిపాజిట్ రూ.1.20 లక్షలు, జీవీ బీమా రూ.14 వేలు, ఆదాయం పన్ను చట్టంలోని 80సీసీడీ (1బీ) సెక్షన్ కింద రూ.50 వేలు, హెచ్ఆర్ఏ మినహాయింపు రూ.1.20 లక్షలు, విద్యా రుణంపై వడ్డీ చెల్లింపులు రూ. 60 వేలు, వైద్యారోగ్య బీమా రూ.23,500 పన్ను మినహాయింపు ఉంటుంది. మొత్తం సంజయ్ తోమర్ ఆదాయంలో రూ.4,09,100లకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆయన వేతనం ప్రకారం చెల్లించాల్సిన పన్ను రూ.1,37,663. వివిధ పథకాల్లో మినహాయింపులతో రూ.86,596 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.52,939 పన్ను ఆదా అవుతుందన్న మాట..