నిర్దిష్ట కాలపరిమితికిగాను నెలనెలా కొద్ది మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలనుకొనేవారికి రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) ఖాతా చక్కని ఎంపిక. మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ మాదిరి మార్కెట్ ఒడిదుడుకులకు ప్రభావితం కాకుండా ఆర్డీపై రాబడులు నికరంగా ఉంటాయి. అందుకే రిస్క్‌కు దూరంగా ఉండే ఇన్వెస్టర్లకు ఇవి ఉత్తమం అని చెప్పవచ్చు. ఇక రికరింగ్ డిపాజిట్లో మీరు నెలకు రూ.10,000 చొప్పున పోస్టాఫీస్ ఆర్డీలోగానీ, ఎస్బీఐ ఆర్డీలోగానీ పెట్టుబడిగా పెడితే ఎంత? వస్తుందో ఇక్కడ చూద్దాం.
పోస్టాఫీస్ ఐదేండ్ల ఆర్డీలో నెలకు రూ.10,000 పెట్టుబడిగా పెడితే చివరకు వచ్చేది రూ.7,14,364. అదే ఎస్బీఐ ఐదేండ్ల ఆర్డీలో నెలకు రూ.10,000 పెట్టుబడిగా పెడితే తుదకు అందేది రూ.7,06,797. దీన్నిబట్టి పోస్టాఫీస్ ఆర్డీలో ఇన్వెస్టర్లకు దాదాపు రూ.8,000 అదనంగా అందే అవకాశం ఉన్నది. ఇక ఇవి ప్రస్తుత వడ్డీరేట్ల ప్రకారం చేసిన లెక్కలు. వీటిలో మార్పులుంటే రాబడులూ మారుతాయి. అయితే సాధారణ డిపాజిటర్లకు 5-10 ఏండ్ల కాలపరిమితిపై 6.30 శాతం నుంచి 6.50 శాతం వరకు వార్షిక వడ్డీరేటును చెల్లిస్తున్న ఎస్బీఐ.. సీనియర్ సిటిజన్లకైతే అర శాతం (0.50%) ఎక్కువ వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నది. దీంతో వారికి 6.80 శాతం నుంచి 7 శాతం మధ్య వడ్డీరేటును పొందవచ్చు. అలాగే వివిధ కాలపరిమితి డిపాజిట్లపై రకరకాల వడ్డీరేట్లను ఎస్బీఐ అందుబాటులో ఉంచింది. కాబట్టి ఆర్డీ కోసం ప్రయత్నించేవారు మరిన్ని కచ్ఛితమైన వివరాల కోసం సమీపంలోని తపాలా శాఖ కార్యాలయాలకుగానీ, ఎస్బీఐ బ్రాంచీలనుగానీ సందర్శించవచ్చు.
ముందుగా ఎంచుకున్న కాలపరిమితికిగాను నెలనెలా నిర్ణీత మొత్తాల్లో డిపాజిట్ చేసే వెసులుబాటును మదుపర్లకు ఆర్డీ ఖాతా కల్పిస్తుంది.
పోస్టాఫీస్‌లో నెలనెలా రూ.100 డిపాజిట్ చేస్తూ కూడా రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరుచుకోవచ్చు. అలాగే పెట్టుబడికి గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. అలాగే మెచ్యూరిటీకి ముందే డిపాజిట్లను ఉపసంహరించుకోవాలనుకుంటే.. ఖాతా తెరిచిన మూడేండ్ల తర్వాతే సాధ్యం. ఇక మీరు ఎంచుకున్న కాలపరిమితి (మెచ్యూరిటీ)కి ఒక్కరోజు ముందు డిపాజిట్లను ఉపసంహరించుకున్నా.. మీ సొమ్ముకు పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా వడ్డీరేటే (4 శాతంగా ఉన్నది) వర్తిస్తుందని మర్చిపోవద్దు.
ఎస్బీఐలోనూ నెలకు కనీసం రూ.100 డిపాజిట్ చేస్తూ ఆర్డీ ఖాతాను ప్రారంభించవచ్చు. అయితే చెల్లింపులు ఆలస్యమైతే జరిమానాలుంటాయి. ఐదేండ్లదాకా కాలపరిమితిగల ఆర్డీలకు ప్రతీ రూ.100కు నెలకు రూ.1.50 ఫైన్ పడుతుంది. కాలపరిమితి ఐదేండ్లపైనైతే రూ.100కు నెలకు రూ.2 జరిమానా ఉంటుంది. ఆలస్యాన్నిబట్టి జరిమానా చెల్లింపుల్లో తేడాలుంటాయి. అయినప్పటికీ డిపాజిట్ ఎంత ఉన్నా.. నెలనెలా సదరు డిపాజిటర్ ఆర్జించే వడ్డీ ఆదాయాన్ని మించి జరిమానాల విలువ మాత్రం ఉండదు. ఒకవేళ వరుసగా 6 నెలలు ఇన్స్టాల్మెంట్స్ చెల్లించకపోతే ఆర్డీ ఖాతా ముందుగానే ముగిసిపోయే ప్రమాదం ఉన్నది. ఆపై మిగిలిన మొత్తాలు ఖాతాదారునికి చెల్లిస్తారు.
