న్యూఢిల్లీ, జూలై 28: కొద్ది సంవత్సరాలుగా బ్యాంక్ డిపాజిట్లపై కనిష్ఠ వడ్డీ రేట్లతో సతమతమైన డిపాజిట్‌దార్లకు మళ్లీ మంచి రోజులొస్తున్నాయి. ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచడం, మరోవైపు దేశంలో రుణాలకు డిమాండ్ జోరందుకోవడంతో డిపాజిట్లను మరింతగా ఆకర్షించేందుకు బ్యాంక్‌లు రేట్లను పెంచకతప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో కొద్ది నెలల్లో బ్యాంక్ డిపాజిట్ రేట్లు శరవేగంతో పెరుగుతాయని ఇక్రా రేటింగ్స్ గురువారం విడుదల చేసిన రిపోర్ట్‌లో తెలిపింది. బ్యాంక్‌లు నిధుల సమీకరణకు ఎక్కువగా ఆధారపడే సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్ (సీడీలు) ఇటీవల క్రమేపీ పెరుగుతున్నాయని, గత కొద్ది సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత గరిష్ఠస్థాయికి చేరాయని ఇక్రా వెల్లడించింది. 2022 జూలై 1 నాటికి బ్యాంక్‌ల సీడీల పరిమాణం గత ఏడాదితో పోలిస్తే 243 శాతం పెరిగి రూ.2.4 లక్షల కోట్లకు చేరుకున్నాయన్నది.
అలాగే సీడీల స్ప్రెడ్ (ఇచ్చి, పుచ్చుకునే రేట్ల మధ్య వ్యత్యాసం), బ్యాంక్‌ల సగటు డిపాజిట్ రేట్లకంటే వేగంగా పెరుగుతున్నాయని, దీంతో హోల్‌సేల్ డిపాజిట్ల వాటా అధికంగా ఉన్న బ్యాంక్‌ల నిధుల వ్యయం వేగంగా పెరుగుతున్నదని ఇక్రా వివరించింది. బాండ్ ఈల్డ్స్ అధికమవుతున్న తరహాలోనే సీడీల స్ప్రెడ్..ఆరు నెలల సగటు బ్యాంక్ డిపాజిట్లతో పోలిస్తే జూలైలో 170 బేసిస్ పాయింట్లకు పెరిగిందని, ఏప్రిల్‌లో ఇది 30 బేసిస్ పాయింట్లు మాత్రమే ఉందని రిపోర్ట్ తెలిపింది. టెర్మ్ డిపాజిట్ రేట్లను పెంచకతప్పని పరిస్థితులు ఏర్పడుతున్నట్టు ఇక్రా వివరించింది. సాధారణంగా సాధారణ పొదుపు దారులు మదుపు చేసుకునే టెర్మ్ డిపాజిట్ రేట్లు పెంచడానికి ఆచితూచి వ్యవహరించే బ్యాంక్‌లు రానున్న నెలల్లో వీటి వడ్డీ రేట్లను వేగంగా పెంచక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయని ఇక్రా రేటింగ్స్ పేర్కొంది.
ఎన్నారైలకు వల
డిపాజిట్లను పెంచుకునే క్రమంలో దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విదేశాల్లో ఉన్న భారతీయులు కలిగిన నాన్-రెసిడెంట్ అకౌంట్స్‌పై అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేయడం మొదలుపెట్టింది. తొలుత ఇదే మార్గాన్ని ఇతర బ్యాంక్‌లు సైతం అనుసరిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. మెరుగైన రాబడుల కోసం షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయడానికి డిపాజిటర్లు మొగ్గు చూపినందున, బ్యాంక్‌ల్లో డిపాజిట్ల వృద్ధి మందగించిందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ చెప్పారు. బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి రేటు గత 14 నెలలుగా ఏక సంఖ్యలోనే ఉంది. ప్రస్తుతం ఇది 9.8 శాతం. కానీ రుణ వృద్ధి మాత్రం జూలై 1 నాటికి 14.4 శాతానికి చేరింది. రుణాలకు అధికంగా డిమాండ్ నెలకొనే సీజన్ వచ్చిన నేపథ్యంలో రుణ వృద్ధికి తగిన రీతిలో డిపాజిట్ల వృద్ధిలేక, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ తగ్గుతుంది. ఇదే సమయంలో రిజర్వ్‌బ్యాంక్ రెపో రేటును మరో 60 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని, దీంతో పాటే ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్, బ్యాంక్ సీడీల రేట్లు అధికమవుతాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అనిల్ గుప్తా అంచనా వేశారు.