Financial Management | పిల్లలకు చిన్న వయస్సు నుంచే ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు పడుతాయని అంటున్నారు. ముఖ్యంగా పిల్లలు వారి తల్లిదండ్రులను, ఇంట్లోని పెద్దలను చూస్తూ పెరుగుతారు కాబట్టి.. ఈ విషయంలో పెద్దలూ వివేకంతో మెదలాలని చెప్తున్నారు. కాగా, బ్యాంకింగ్ లావాదేవీలు, పెట్టుబడులు, ఆదాయ-వ్యయాలపట్ల అవగాహన పెరిగేలా పిల్లలను గైడ్ చేయాల్సిన అవసరం ఉన్నది.
ఏది అవసరం, మరేది అనవసరమో వారికి తెలిసేలా చెప్పాలని, ఈ సమయంలో విసుక్కోకుండా వివరించాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతీదాని విలువ తెలుసుకునేలా వారిలో ఆసక్తిని పెంపొందిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా దగ్గరుండి గమనిస్తూ వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలనూ ఇవ్వాలంటున్నారు. దీంతో వారిలో నాయకత్వ లక్షణాలనూ పెంపొందించినట్టవుతుంది.