న్యూయార్క్ : ఇంటి నుంచి పనిచేసింది ఇక చాలు త్వరగా కార్యాలయాలకు వచ్చేయాలని టెస్లా ఉద్యోగులకు కంపెనీ అధినేత ఎలన్ మస్క్ తేల్చిచెప్పారు. టెస్లాలో ఇంటి నుంచి పనిచేయడం ఎంతోకాలం ఆమోదయోగ్యం కాదని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో ప్రపంచ కుబేరుడు స్పష్టం చేశారు. కార్యాలయాలకు రావడం ఇష్టం లేని ఉద్యోగులు సంస్ధను విడిచిపెట్టి వెళ్లాలని టెస్లా సీఈఓ పేర్కొన్నారు.
రిమోట్ వర్క్ మోడ్‌ను ఎంచుకునే వారు ఎవరైనా వారానికి కనీసం 40 గంటలు ఆఫీస్‌లో ఉండాలని లేకుంటే టెస్లా నుంచి బయటకు వెళ్లవచ్చని ఉద్యోగులకు పంపిన అధికారిక ఈమెయిల్లో మస్క్ తేల్చిచెప్పారు. ఇక మస్క్ ఎలాంటి చండశాసనుడో ఉద్యోగులకు ఇప్పటికి తెలిసివచ్చిందని, మస్క్ తీరే అంతని సిలికాన్‌వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్ట్, ఎంట్రప్రెన్యూర్ కీత్ రబోయిస్ చెప్పుకొచ్చారు.
స్పేస్ ఎక్స్‌ను స్టార్ట్ చేసిన తొలినాళ్లలో అక్కడి ఇంటర్న్స్ కొందరు కాఫీ షాపు ముందు క్యూ కట్టడం చూసిన మస్క్ వారిపై మండిపడ్డాడని గుర్తుచేశారు. వారందరినీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తానని బెదిరించాడని, మరోసారి ఇలా చేయవద్దని ఫైర్ అయ్యాడని చెప్పారు. ఉద్యోగుల కదలికలను పసిగట్టేందుకు టెస్లా సీఈఓ ఆపై ఎక్కడికక్కడ సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేశాడని వెల్లడించారు.