IT on Home Rent | వేతన జీవులు, అవిభాజ్య ఉమ్మడి కుటుంబం (హెచ్‌యూఎఫ్), చిన్న వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు ప్రతియేటా తమ ఆదాయంపై ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తుంటారు. కొన్ని కుటుంబాలకు ఇంటి అద్దె కూడా అదనపు ఆదాయంగా ఉంటుంది. అలా ఆదాయం వచ్చే మార్గాల వివరాలన్నీ ఐటీ రిటర్న్స్‌లో తెలియజేయాల్సిందే. ఆదాయం పన్ను చట్టంలో ఇంటి అద్దె ఆదాయంపైనా పన్ను మినహాయింపులు పొందే వెసులుబాట్లు ఉన్నాయి. ఇంటి అద్దె ద్వారా సుదీర్ఘకాలం సంపాదించిన ఆదాయం.. సంబంధిత వ్యక్తి.. పర్సనల్ ఇన్‌కం టాక్స్ శ్లాబ్‌ల్లో మార్పులు చేయాల్సి వస్తుంది. కనుక ఇంటి యజమానిగా ఆయా శ్లాబ్‌లు, మినహాయింపుల వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అవేమిటో ఓ లుక్కేద్దామా..!
ఏదైనా స్థిరాస్థి లేదా ఇంటిని అద్దెకు గానీ, లీజుకు గానీ ఇచ్చే ఆదాయం.. ‘స్థిరాస్థి ద్వారా ఆదాయం’ ఆప్షన్ కింద ఐటీ రిటర్న్స్‌లో చూపాలి. ఇంటి అద్దె రూపేణా వచ్చే మొత్తం ఆదాయాన్ని సంబంధిత వ్యక్తులు తమ మొత్తం ఆదాయంలో కలిపి చూపాలి. ఆ ఆదాయాన్ని బట్టి వర్తించే పన్ను శ్లాబ్ ఆధారంగా ఇన్‌కం టాక్స్ పే చేయాల్సి ఉంటుంది.
మీకు ఏ ఇతర ఆదాయం లేకుండా.. కేవలం ఇంటి అద్దెలపై వచ్చే ఆదాయం ఏడాదికి రూ.2.5 లక్షల్లోపే ఉంటే ఎటువంటి పన్ను భారం ఉండదు. ప్రతి యేటా ఇంటి యజమానులు ఇంటి అద్దె పెంచుతుంటారు. అలా వారు పెంచే ఇంటి అద్దెను బట్టి మీ ఆదాయం పన్ను శ్లాబ్ మారుతూ ఉంటుంది. వచ్చే ఏడాది 20 శాతం ఆదాయం పెరిగితే.. మీరు పన్ను పరిధిలోకి వస్తారు. అయినా ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్, ఇతర సెక్షన్ల కింద మినహాయింపులు క్లయిమ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రూ.5 లక్షల్లోపు ఆదాయానికి పన్ను చెల్లించనవసరం లేదు. ఇంటి అద్దెకూ ఇవే రూల్స్ అమలవుతాయి.
ప్రతి ఇంటి యజమాని.. ప్రతి సంవత్సరం కూడా తనకు వచ్చే మొత్తం అద్దె నుంచి ఆస్తి పన్ను చెల్లిస్తారు. అలా చెల్లించగా మిగిలిన ఆదాయంపై పన్ను 30 శాతం తగ్గింపు ఉంటుంది. మీకు ఏటా రూ.3.60 లక్షల వరకు ఇంటి అద్దె రూపంలో ఆదాయం వస్తే.. దానిపై ఆస్తి పన్ను రూ.20 వేలు చెల్లించారని అనుకుందాం.. మిగిలిన ఆదాయం రూ.3.40 లక్షలు. ఇందులో 30 శాతం రూ.1.10 లక్షలు మినహాయిస్తారు. ఇప్పుడు మిగిలిన నికర ఇంటి అద్దె రూ.2.30 లక్షలు. ఆదాయం పన్ను వడ్డింపునకు ఈ ఆదాయమే పరిగణనలోకి తీసుకుంటారు. ఎన్నారైలకు కూడా ఇంటి అద్దె, స్థిరాస్తులపై వచ్చే వడ్డీ, ఇతర ఆదాయాలకు ఉన్నా ఇదే సూత్రం అమలవుతుంది.
ఇంటి రుణం ద్వారా కొన్న ఇంటిని అద్దెకు ఇస్తే.. రుణంపై చెల్లిస్తున్న వడ్డీపై పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 24 (బీ) కింద రూ.2 లక్షల వరకు వడ్డీ చెల్లింపుపై పన్ను మినహాయింపు క్లయిమ్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఉదాహరణకు భార్యాభర్తలు కలిసి కొనుగోలు చేసిన ఆస్తి ఉమ్మడి ఆస్తి కిందకు వస్తుంది. అటువంటప్పుడు సహ యజమాని కూడా పన్ను మినహాయింపు క్లయిమ్ చేసుకోవచ్చు. ఇల్లు కొనుగోలు ఒప్పందంలో పేర్కొన్న మేరకు సంబంధిత సహ యజమాని వాటాను బట్టి పన్ను మినహాయింపు క్లయిమ్ వర్తిస్తుంది. అలా వాటా నిష్పత్తి ప్రాతిపదికన ఇంటి రుణంపై చెల్లిస్తున్న వడ్డీకి పన్ను మినహాయింపు క్లయిమ్ చేయడానికి వెసులుబాటు ఉంది.