ముంబై, ఆగస్టు 19: మార్కెట్లో సెకండ్ హ్యాండ్ కార్లకు గిరాకీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి తగ్గట్టుగానే దాని ఫైనాన్సింగ్కూ భారీగా ఆదరణ ఉంటున్నది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ క్రిఫ్ హై మార్క్ బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. కొత్త కార్ల లోన్ మార్కెట్‌తో పోల్చితే యూజ్డ్ కార్ లోన్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్నట్టు తేలింది. గత ఐదేండ్లలో న్యూ ఆటో లోన్ పోర్ట్‌ఫోలియో 17.6 శాతం పెరిగింది. 2021 జూన్‌లో రూ.4.4 లక్షల కోట్లుగా ఉంటే.. 2026 జూన్‌లో రూ.9.9 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో యూజ్డ్ కార్ ఫైనాన్సింగ్ 26.2 శాతం వృద్ధితో రూ.1.3 లక్షల కోట్లకు ఎగిసింది.
2021 జూన్‌లో ఇది కేవలం దాదాపు రూ.40,000 కోట్లుగానే ఉన్నట్టు క్రిఫ్ హై మార్క్ తెలిపింది. మార్కెట్లో కొత్త వాహనాలను కొనాలంటే కనీసం రూ.5-6 లక్షలైనా పెట్టాల్సి వస్తున్నది. ఎక్కువగా రూ.5-10 లక్షల శ్రేణి వాహనాలకు గిరాకీ ఉంటుండగా, వాటికి తగ్గ లోన్లే తీసుకుంటున్నారు. అయితే యూజ్డ్ కార్ మార్కెట్లో రూ.2 లక్షలకే మంచి కండీషన్లో ఉన్న వాహనాలు లభిస్తున్నాయి. దీంతో చాలామంది సెకండ్ హ్యాండ్ మార్కెట్వైపే మొగ్గు చూపుతున్నారు.