Cibil Score | గతంతో పోలిస్తే ఇప్పుడు ఉద్యోగావకాశాలు పెరిగాయి.. ఐటీ, బిజినెస్, బ్యాంకింగ్ తదితర రంగాల్లో మంచి నైపుణ్యం ఉంటే మంచి ప్యాకేజీతో కూడిన వేతనం పొందొచ్చు. అలా మంచి వేతనం అందుకుంటున్నా.. ఒక్కోసారి ఎమర్జెన్సీగా నిధులు అవసరం కావచ్చు. అప్పుడు పర్సనల్ లోన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. బ్యాంకులో పర్సనల్ రుణం కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఒక్కోసారి సంబంధిత దరఖాస్తు దారు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నందున వ్యక్తిగత రుణం ఇవ్వలేమని చెబుతుంటాయి..
అదే పేరు గల వ్యక్తులు గానీ.. వారి పేరుమీదే గానీ లోన్ తీసుకున్నట్లు ‘సిబిల్ స్కోర్’ చెబుతూ ఉంటుంది. ఇటువంటి సమస్యను పరిష్కరించుకోవాలంటే ముందు ప్రతి ఒక్కరూ తరుచుగా తమ ‘సిబిల్ స్కోర్’ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం వల్ల పొరపాట్లు దొర్లితే చెక్ చేసుకోవచ్చు.. సర్దుబాట్లు చేసుకోవచ్చు.
మామూలుగానైతే ఒక వ్యక్తి ‘సిబిల్ స్కోర్’ 750 పాయింట్లు ఉంటే బాగానే ఉన్నట్లే. ఇటువంటి వారికే బ్యాంకులు తేలిగ్గా రుణాలిస్తాయి. సిబిల్ స్కోర్ బేష్షుగ్గా ఉంటే వడ్డీ కూడా తగ్గుతుంది. ఒక్కోసారి రుణ గ్రహీత సకాలంలో నెలవారీ ఈఎంఐ పేమెంట్స్ చేస్తున్నా.. సంబంధిత బ్యాంకులు తమ క్రెడిట్ బ్యూరోలకు సకాలంలో నివేదించక పోగా.. లేట్ పేమెంట్స్ అని నివేదిక ఇస్తే.. ఆయా రుణ గ్రహీతల ‘సిబిల్ స్కోర్’ తగ్గిపోతూ ఉంటుంది. పేమెంట్స్’లో ఆలస్యం లేనప్పుడు ఆ సంగతి సంబంధిత బ్యాంకు అధికారి దృష్టికి తీసుకెళ్లి నివేదిక సరి చేసేలా చర్యలు తీసుకోవాలి.
ఒక్కోసారి రుణ గ్రహీత పేరు, అడ్రస్, పాన్ కార్డుల్లో తప్పులు, అక్షర దోషాలు రావచ్చు. ఇటువంటి పొరపాట్లు ఉంటే వెంటనే చెక్ చేసుకుని సరి చేసుకోవడం మంచిదని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల సిబిల్ స్కోర్ తగ్గకపోవచ్చు గానీ, రుణం అవసరమైనప్పుడు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
ఇల్లు, వెహికల్ లోన్ తీసుకున్నవారు.. ఆ రుణాలను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ చేసుకుంటారు. ఇలా బదిలీ చేసుకున్న రుణం రెండు బ్యాంకుల్లో బాకీ ఉన్నట్లు ’సిబిల్ స్కోర్’ నివేదికలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటప్పుడు తొలుత రుణం తీసుకున్న బ్యాంకు అధికారులను సంప్రదించి లోన్ పే చేసినట్లు క్రెడిట్ బ్యూరోలకు నివేదిక సమర్పించాలని కోరాలని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.
ఒక్కోసారి రుణం తీసుకున్న వ్యక్తి పేరులో గానీ, అడ్రస్‌లో గానీ, పాన్ కార్డు నంబర్లో గానీ తప్పులు ఉంటే.. అదే పేరు గల వ్యక్తి తీసుకున్న రుణం వివరాలు మీ ‘సిబిల్ స్కోర్’లో కనిపిస్తుండవచ్చు. అటువంటప్పుడు సంబంధిత బ్యాంకు అధికారి దృష్టికి, క్రెడిట్ బ్యూరో దృష్టికి తీసుకెళ్లి పొరపాట్లను సరిదిద్దుకోవాలి.
క్రెడిట్ కార్డు మీద సంబంధిత బ్యాంకు పరిమితి పెంచుతుంది. ఒక్కోసారి సంబంధిత బ్యాంకు.. క్రెడిట్ బ్యూరోకు ఈ సంగతి తెలపకపోవచ్చు. కొత్త లిమిట్ ప్రకారం మీరు క్రెడిట్ కార్డు వాడితే.. అధికంగా వినియోగించారనే పేరుతో సిబిల్ స్కోర్ తగ్గిపోవచ్చు. కనుక మీ క్రెడిట్ కార్డు అకౌంట్ వివరాల్లో ఏ పొరపాటు ఉన్నా వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. పేమెంట్స్ సరిగ్గా ఉన్నాయా.. లేదా.. చెక్ చేసుకోవాలి. మీరు మీ సిబిల్ స్కోర్ లోని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.. చిన్న తప్పు ఉన్నా నిర్లక్ష్యం చేయొద్దు.. వెంటనే సంబంధిత బ్యాంకు, క్రెడిట్ బ్యూరోలను సంప్రదించి తప్పులను సరి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.