ముంబై, ఆగస్టు 27: భారతీయ క్యాంపస్ రిక్రూట్మెంట్లు మరింత వ్యూహాత్మకంగా, నైపుణ్య ఆధారితంగా తయారయ్యాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ).. నియామకాల ప్రక్రియను అంతకంతకూ మార్చేస్తున్నది మరి. ఓవైపు నైపుణ్యాలపై దృష్టి పెడుతూనే.. మరోవైపు 86 శాతం సంస్థలు తమ ఉద్యోగ నియామకాల్లో ఏఐకి పెదపీట వేస్తున్నాయని గురువారం విడుదలైన డెలాయిట్ ఇండియా క్యాంపస్ వర్క్‌ఫోర్స్ ట్రెండ్స్-2026 నివేదిక తెలిపింది. ఆయా రంగాల్లోని 257 కంపెనీలు, 505 క్యాంపస్‌ల అభిప్రాయాలు, తీరుతెన్నుల ఆధారంగా ఈ రిపోర్టు తయారైంది.
కంపెనీ యాజమాన్యాలు క్యాంపస్ హైరింగ్ బడ్జెట్లను పెంచుతున్నాయని ఈ తాజా నివేదిక పేర్కొన్నది. ఫ్రెషర్స్‌తోపాటు కెరీర్ ప్రారంభ దశలో ఉన్న ఉద్యోగులను తీసుకొని, వారికి భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా తర్ఫీదు ఇచ్చేందుకు సంస్థలు 19 శాతం బడ్జెట్‌ను పెంచాయని వెల్లడించింది. ఇక నియామకాల్లోకి ఏజెంటిక్ ఏఐని లోతుగా తీసుకెళ్తున్న నిర్వాహకులు.. ఇంకోవైపు ప్రధానమైన డిజిటల్, విశ్లేషణాత్మక నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతుల కోసం నియామకాల్లో ఇంటర్న్‌షిప్‌ను కూడా బలోపేతం చేస్తున్నారని వివరించింది. ఈ మార్పులు.. సంప్రదాయ క్యాంపస్ హైరింగ్ విధానం నుంచి మరింత నిర్మాణాత్మక, నైపుణ్య ఆధారిత నియామకాల వైపునకు కంపెనీలు మారుతున్నాయన్న దానికి అద్దం పడుతున్నట్టు డెలాయిట్ ఇండియా తమ నివేదికలో అభిప్రాయపడింది.
నేడు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అంతకంతకూ పెరిగిపోతున్నది. ప్రస్తుతం ఏఐ ప్రవేశించని పని లేదంటే అతిశయోక్తి కాదు. ఉద్యోగులతో పోల్చితే ఏఐ వాడకం.. కంపెనీలకు లాభదాయకంగా మారుతున్నది మరి. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ఆ తర్వాత నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం.. ఉత్పాదకత పెరుగడం, ముఖ్యంగా మానవ వనరుల ద్వారా ఎదుర్కొనే జీతభత్యాలు, పని గంటలు, సెలవులు, ఇతర ప్రయోజనాలు తదితరాలు లేకపోవడం వంటివి కంపెనీలను ఏఐ దిశగా నడిపిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ, ఆటో, లైఫ్ సైన్సెస్, తయారీ, టెక్నాలజీ రంగాల్లో ఏఐ వినియోగం విపరీతంగా పెరిగినది తెలిసిందే. ఈ క్రమంలో ఆయా సంస్థ లు తమ ఉద్యోగ నియామకాలను తగ్గించుకోవడం, ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నదీ చూస్తూనే ఉన్నాం.
గూగుల్ క్లౌడ్‌తో తమ భాగస్వామ్యం విస్తరణలో భాగంగా కంపెనీల కోసం కొత్త గూగుల్ జెమినీ ఆధారిత పరిష్కారాలపై పనిచేయడానికి 10వేల మంది ఏఐ సర్టిఫైడ్ స్పెషలిస్టులను సిద్ధం చేయబోతున్నట్టు దేశీయ ప్రముఖ ఐటీ రంగ సంస్థ విప్రో గురువారం ప్రకటించింది. ఇందులో టెక్నాలజీ సపోర్ట్ నిర్వహణకు క్లెయింట్ సైట్‌పై పనిచేసేందుకు 1,500 ఫార్వర్డ్-డెప్లాయ్డ్ ఇంజినీర్ల (ఎఫ్‌డీఈలు)నూ అందుబాటులోకి తేనున్నట్టు ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. కాగా, సంస్థాగతంగా జెమినీ ఎంటర్ప్రైస్, ఏజెంటిక్ ఏఐల వాడకాన్ని పెంచడానికే విప్రో ఈ మేరకు ప్రణాళికలను రూపొందిస్తున్నది.