BitCoin M-Cap | క్రిప్టో కరెన్సీలతో ముప్పు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్స్ బలంగా పని చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం.. పెరుగుతున్న వడ్డీరేట్లు.. వివిధ వస్తువుల ధరలు పైపైకి దూసుకెళ్తున్న తరుణంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్స్ బలహీనం అవుతున్నాయి. ఫలితంగా క్రిప్టో కరెన్సీలు బేజారుమంటున్నాయి. క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సగానికి పడిపోయింది. సోమవారం మార్కెట్ ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ విలువ 33,400 డాలర్లు. గతేడాది ఆల్‌టైమ్ రికార్డు పలికిన బిట్‌కాయిన్ ధర 67,566 డాలర్లు. అంటే బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సగానికి పడిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ వస్తువుల ధరల పెరుగుదలతోపాటు వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలు ఇన్వెస్టర్ గ్రూప్‌లపై నెగెటివ్ సెంటిమెంట్ చూపుతున్నాయని గైట్టస్ క్రిప్టో ఎక్స్చేంజ్ విక్రమ్ సుబ్బురాజ్ చెప్పారు. ట్రేడింగ్ రీత్యా 635 బిలియన్ల డాలర్లకు పైగా ఉన్న క్రిప్టో అసెట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్లో గత 24 గంటల్లో బిట్ కాయిన్ ఎం-క్యాప్ 37.26 బిలియన్ డాలర్లు చేతులు మారింది.
గతేడాది చివరిలో ఫుల్ స్వింగ్‌లో ఉన్న క్రిప్టో కరెన్సీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.15 లక్షల కోట్ల డాలర్లు. కానీ ఇప్పుడు మొత్తం క్రిప్టోల ఎం-క్యాప్ 50 శాతానికి పైగా పతనమై 1.51 లక్షల కోట్ల డాలర్లకు పతనం అయ్యింది. బిట్ కాయిన్ విలువ పతనమైనా.. క్రిప్టోల్లో ఆధిపత్యం మాత్రం బిట్ కాయిన్దే. మొత్తం క్రిప్టోల ఎం-క్యాప్‌లో బిట్‌కాయిన్ వాటా 41.64 శాతం. అయితే, క్రిప్టో అసెట్స్ ఆల్‌టైం రికార్డు పలికినప్పుడు బిట్ కాయిన్ వాటా 36-28 శాతమే ఉండటం గమనార్హం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బిట్ కాయిన్ విలువ మళ్లీ 30 వేల డాలర్ల దిగువకు పడిపోతుందని అంచనా వేస్తున్నట్లు ముడ్రెక్స్ సీఈవో కం కో ఫౌండర్ ఎదుల్ పటేల్ తెలిపారు.