Loans Payment | ఎమర్జెన్సీ అవసరాలు ఉన్నా గతంలో లోన్ కావాలంటే నానా ఇక్కట్ల పాలవ్వాల్సి వచ్చేది.. కానీ ఇప్పుడా పరిస్థితులేం లేవు. అవసరం లేకపోయినా రుణాలిచ్చేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్యూ కడుతున్నాయి. చెల్లించే వెసులుబాటు ఉంటే.. ఏదైనా వస్తువు కొనుగోలు చేసినా తక్షణం డబ్బు పే చేయాల్సిన అవసరం లేకుండా.. వాయిదా పద్దతుల్లో చెల్లించడానికి ఈఎంఐ ఫెసిలిటీ కల్పిస్తున్నాయి బ్యాంకులు.. ప్రత్యేకించి పండుగల సీజన్లో దాదాపు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వాడుకున్నారు. అయితే, ఎమర్జెన్సీలో చేసిన అప్పైనా, పండుగ సీజన్లో ఏదైనా వస్తువుగానీ, వెహికల్ గానీ కొనడానికి చేసిన అప్పైనా సాధ్యమైనంత వేగంగా క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటేనే ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తవని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.
ప్రత్యేకించి పండుగల వేళ చేసిన ఖర్చు ఎంతో నిర్ధారించుకోవాలి. ఇందులో మీరు ఆదా చేసిన మొత్తం.. లోన్ తీసుకున్న మొత్తం చెక్ చేసుకోవాలి.. ఏయే లోన్లకు ఎంత గడువు ఉంది.. చెల్లిస్తున్న వడ్డీ అంశాలూ చెక్ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా పర్సనల్ లోన్లూ.. ఇప్పుడు కొని తర్వాత చెల్లించండి (బీఎన్‌పీఎల్) లోన్ల వివరాలు పక్కపక్కనే రాసి పెట్టుకుని చెక్ చేసుకుంటే.. మీ లోన్లు ఎంత.. ఏయే లోన్లు ఎంత చెల్లించాలో క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నెలవారీగా మీకు వచ్చే ఆదాయం, నెలవారీ ఖర్చులు పోనూ మిగిలే మొత్తం ఎంత మిగులుతుందో తెలుస్తుంది. దాని ఆధారంగా రుణ చెల్లింపులకు ప్లాన్ చేసుకోవాలి.
తొలుత ముందస్తుగా తీర్చేయాల్సిన.. అందుకు వీలు ఉన్న లోన్లు గుర్తించాలి.. ప్రత్యేకించి ఎక్కువ వడ్డీ లోన్లు సాధ్యమైనంత వేగంగా, త్వరగా క్లియర్ చేసుకోవాలి.. అలా కానీ పక్షంలో మీరు పొదుపు చేసే మొత్తం వడ్డీ పేమెంట్స్‌కే పోతుంది. చిన్నచిన్న రుణాలు తీసుకున్నా.. అవి ఎక్కువగా ఉంటే భారంగానే కనిపిస్తుంది. ఈ చిన్న రుణాల ముందస్తు చెల్లింపులకు గల అవకాశాలు చెక్ చేసుకోవాలి. ఏ లోన్ పేమెంట్స్ అయినా ముందస్తు చెల్లిస్తామంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఫీజు వసూలు చేస్తాయి. అయినా ఆ ఫీజు ఎంత చెల్లించాలి అన్న అంశం క్లారిటీ వస్తే.. మనం నెలవారీగా చెల్లించే వడ్డీ కంటే తక్కువగా ఉంటే ముందస్తు పేమెంట్స్‌కు ప్రియారిటీ ఇవ్వడం బెటర్ అంటున్నారు ఆర్థిక నిపుణులు.
భవిష్యత్ కుటుంబ అవసరాల కోసం కొన్ని స్కీమ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం.. కానీ తక్కువ రిటర్న్స్ వచ్చే పథకాల్లో పెట్టుబడి వల్ల ఉపయోగమేం ఉండదు. కేవలం ఏడెనిమిది శాతం రిటర్న్స్ వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం కంటే 15-16 శాతం వడ్డీ చెల్లించే లోన్లు తీసుకోవడం కరెక్ట్ కాదు. అలా కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ), లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ (బీమా పాలసీ) లపై లోన్లు తీసుకోవచ్చు. ఎఫ్డీలు, బీమా పాలసీలపై తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుంది.. బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నా తక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
మరోవైపు ఆదాయం పెంచుకునేందుకు గల మార్గాలను అన్వేషిస్తే త్వరగా లోన్లు తీర్చే రూట్ కనిపిస్తుంది. దీనిపై ఫ్యామిలీ మెంబర్లతో చర్చించండి. ఇన్‌కం, లోన్ నిష్పత్తి తగ్గించుకోవాడానికి ట్రై చేయండి. ఇప్పటికే చెల్లిస్తున్న హోంలోన్ నెలవారీ వాయిదా (ఈఎంఐ) తగ్గించుకునే అవకాశంపై సంబంధిత బ్యాంకు మేనేజర్‌తో సంప్రదించడం బెటర్‌గా ఉంటుంది. ఇక ఫెస్టివ్ సీజన్లో కుటుంబ అవసరాలు, ఫ్యామిలీ మెంబర్స్ ఆకాంక్షలు, ఆనందం మేరకు లోన్లు తీసుకుని వస్తువులు కొనుగోలు చేసినా.. త్వరితగతిన ఆ లోన్లు చెల్లిస్తేనే ఆ సంతోషం డబులవుతుంది. కనుక మీరు చేసిన లోన్ల చెల్లింపులకు ప్రణాళికలు తక్షణం రూపొందించి అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
కుటుంబ అవసరాల కోసం లోన్లు చేసినా.. వాటిని తిరిగి చెల్లించే వరకూ ఖర్చులు తగ్గించుకోవడం బెటర్. లేని పక్షంలో ఎకనమికల్గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లగ్జరీ.. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. కొంత కాలం తక్కువ మొత్తం డబ్బుతోనే కుటుంబ నిర్వహణ.. జీవనం సాగించేలా అలవాట్లు మార్చుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కొత్తగా లోన్లు తీసుకోవడం గానీ, క్రెడిట్ కార్డును వాడుతూ కొనుగోళ్లు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.