ముంబై, ఏప్రిల్ 6: బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ మంగళవారం గరిష్ఠ స్థాయిలో 43 తీవ్ర అనారోగ్యాల కవరేజీతో ఓ సరికొత్త ఆరోగ్య బీమాను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం పోటీ సంస్థలు సగటున 5 నుంచి 30 వ్యాధులకే బీమా కవరేజీని ఇస్తున్నాయని ఈ సందర్భంగా సంస్థ గుర్తుచేసింది. మార్కెట్ రిసెర్చ్ ద్వారా కస్టమర్ల అభిప్రాయాల ఆధారంగా ఈ పాలసీని రూపొందించామని వివరించింది. క్యాన్సర్ కేర్, కార్డియోవాస్కులర్ కేర్, కిడ్నీ కేర్, న్యూరో కేర్, ట్రాన్స్‌ప్లాంట్స్ కేర్, సెన్సరీ ఆర్గాన్ కేర్‌తోపాటు డయాలసిస్ కేర్, ఫిజియోథెరపీ కేర్ వంటివి తమ పాలసీలో ఉన్నాయని తెలిపింది. గరిష్ఠ బీమా సదుపాయం రూ.2 కోట్లని వెల్లడించింది. పెద్దలైతే 18 నుంచి 65 ఏండ్లవారు ఈ బీమాను కొనుగోలు చేయవచ్చని, పిల్లలైతే 3 నెలల నుంచి 30 ఏండ్ల వరకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. జీవితకాలంపాటు రెన్యువల్‌కు వీలుంటుందన్నది. ఈ పాలసీలో వ్యక్తిగత, భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇలా అందరికీ కవరేజీ ఉంటుందని బజాజ్ అలియాంజ్ వెల్లడించింది. ప్రీమియంలు వాయిదా పద్ధతుల్లో చెల్లించవచ్చని, రాయితీలూ ఉంటాయన్నది.