Financial Plan | ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు తమ పిల్లలకు బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలని, లైఫ్‌లో ఆర్థికంగా సెటిల్ కావాలని కోరుకుంటారు. అందుకోసం తమ సంతోషాల్ని పక్కన బెట్టి మరీ డబ్బు పొదుపు చేసి పిల్లల్ని ఉన్నత విద్యా కోర్సుల్లో చేర్పిస్తుంటారు. పిల్లల మీద ప్రేమతో వారు అడిగినదల్లా కొని పెడుతుంటారు. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనీ మ్యాటర్స్‌పై పిల్లలతో చర్చిస్తే వారిపై చెడు ప్రభావం పడుతుందేమోనని భయ పడుతుంటారు. మనీ మ్యాటర్స్‌కు దూరంగా ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వారికి ఫ్యూచర్లో మనీ విలువ ఏమిటో తెలియకుండా పోయే ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక సమస్యల్లో చిక్కుకోవచ్చు. కనుక పేరెంట్స్ తమ పిల్లలకు చిన్నతనం నుంచే మనీ విలువ ఏమిటో తెలియజేస్తుండాలి. ఇతర అంశాలతోపాటు మనీ, ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ వంటి అంశాలు నేర్పేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలు ప్రయోజకులు కావడానికి బుక్ నాలెడ్జ్ మాత్రమే సరిపోదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కావాలి. క్లాస్‌ల్లో మ్యాథ్స్ పాఠాలు నేర్చుకునే పిల్లలకు వాటి ఆచరణ కూడా తెలియాలి. ఉదాహరణకు దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసే వస్తువులకు ఎంత బిల్లయింది.. మీ వద్ద ఎంత డబ్బు మిగిలి ఉందో తేల్చండనే లెక్కలు వస్తాయి. ఇవీ ఊహాజనితంగా ఉండటం వల్ల పిల్లలు వాటిపై అనాసక్తి చూపుతుంటారు. అలా కాక పిల్లల్ని షాప్‌కు తీసుకెళ్లి షాపింగ్ చేయిస్తే ప్రాక్టికల్‌గా డబ్బు ఎలా ఖర్చవుతుందో తెలుసుకుంటారు. ఫలితంగా ఆచరణలో మనీ ఎలా ఖర్చు చేయాలో తెలుస్తుంది. మనీ మ్యాటర్స్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో అర్థం అవుతుంది.
పిల్లలకు చిన్న వయస్సులో ఉన్నప్పటి నుంచే పొదుపు చేయడం నేర్పడానికి ఒక పిగ్గీ బ్యాంక్ కొనిస్తే సరి. పేరెంట్స్తోపాటు అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, ఇతర బంధువులు నగదు బహుమతులు ఇస్తుంటారు. అలా వచ్చిన గిఫ్ట్ క్యాష్ ఖర్చు చేయకుండా దాచుకోమని సూచిస్తే సరి. కొంచెం పెద్ద పిల్లలైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి.. పాకెట్ మనీతోపాటు గిఫ్ట్‌ల రూపేణా వచ్చిన క్యాష్ కూడా వారి ఖాతాలో జమ చేయండి..గతంతో పోలిస్తే, ఇప్పుడు పలు ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు మైనర్ పిల్లలకు బ్యాంక్ అకౌంట్ ఫెసిలిటీ కల్పిస్తున్నాయి.
వారి వయస్సు ఆధారంగా తల్లిదండ్రుల సాయంతో ఈ అకౌంట్స్ మేనేజ్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు పెట్టే ఖర్చులు తెలుసుకునే తేలికవుతుంది. కాలేజీ కోర్సులు అభ్యసించే పిల్లలకైతే పేరెంట్స్ తమ క్రెడిట్ కార్డు మీద యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు ఇవ్వడానికి వీలవుతుంది. అయితే, ఆ యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే. అంటే ప్రాథమిక క్రెడిట్ కార్డు గల తల్లి లేదా తండ్రి యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆ కార్డును పిల్లలు మిస్యూజ్ చేయకుండా వారి ఖర్చులను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.
ఇప్పుడు ఏరోజుకారోజు వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. రెండు దశాబ్ధాల క్రితం పిల్లలు తమకు రెండ్రూపాయలిస్తే తెగ సంతోషించేవారు. తమకు అవసరమైన తిను బండారాలు కొనుక్కునే వారు. కానీ ఇప్పుడు అదే రెండ్రూపాయలకు ఏం వస్తుందంటే వెంటనే సమాధానం చెప్పలేం. ద్రవ్యోల్బణం వల్ల డబ్బు విలువ ఎలా పడిపోతుందో పిల్లలు తెలుసుకోవచ్చు. మున్ముందు పిల్లల భవిష్యత్ క్లిష్టతరం కాకుండా ఉండాలంటే వారికీ డబ్బు విలువెంతో చెప్పాలి. బడ్జెట్ రూపకల్పన, తదనుగుణంగా ఖర్చు, పొదుపు, పెట్టుబడి, ఆదాయం వంటి విషయాలు పిల్లలకు తెలిసేలా చేయడం పేరెంట్స్ బాధ్యత అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
కొందరు పేరెంట్స్ తమ పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీని ఎందుకు వాడుతున్నారో పట్టించుకోరు. పిల్లలేదైనా అడిగితే కొని ఇవ్వడానికి ముందుకొస్తారే తప్ప దాని అవసరం ఏంటో తెలుసుకోకపోవడం సరి కాదు. కనుక దాని అవసరం ఉందా? లేదా? తెలుసుకుని కొనడానికి ప్రాధాన్యం ఇస్తే.. మన అవసరం.. కోరికల మధ్య తేడా తెలిసేలా చేస్తే పిల్లల్లోనూ ఆలోచన మొదలవుతుంది. వేస్ట్ ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేయడం పెంచుకుంటారు. ఎక్కడ ఖర్చు చేయాలి.. ఎంత ఖర్చు చేయాలి.. పొదుపు చేస్తే ప్రయోజనాలేమిటో తెలుసుకుంటే మున్ముందు వారికి ఫైనాన్సియల్ ప్లాన్ మేనేజ్మెంట్ తేలికవుతుంది.
ఇప్పుడు ఫైనాన్సియల్ మ్యాటర్స్ అంటే మనీ సంపాదించి ఖర్చు చేయడం లేదా పొదుపు చేయడమే కాదు.. ఇన్వెస్ట్‌మెంట్‌పైనా అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడంతా డిజిటల్ యుగం. క్షణాల్లోనే ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్ జరిగిపోతుంటాయి. కనుక ఈ అంశాలన్నింటిపై అవగాహన కలిగి ఉంటే ఫ్యూచర్లో కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బ్యాంకింగ్ లావాదేవీలతోపాటు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ గురించి తెలుసుకోగలిగితే.. ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయో తెలుస్తుంది. టార్గెట్స్ ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, సకాలంలో విత్‌డ్రా చేయడంపై పిల్లలకు అవగాహన కల్పించాల్సి అవసరం ఉందని ఆర్థిక వేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు.