న్యూఢిల్లీ: అనునిత్యం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో సమూల మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత స్మార్ట్ యుగంలో టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతోంది. ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటేనే గొప్ప.. 1990వ దశకం చివరిలో టెలికం రంగంలోకి ప్రైవేట్ సంస్థలు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితులు మారిపోయాయి. దీనికి తోడు ప్రస్తుతం అనునిత్యం మారుతున్న టెక్నాలజీతో కేవలం సిమ్ కార్డుతోనే ఫోన్ చేయడం మొదలైంది.
తాజాగా టచ్ స్క్రీన్ ఫోన్లు వచ్చేశాయి. ఇక సిమ్లేకుండా మొబైల్ ఫోన్ వాడే సమయం వచ్చేసింది. ఇక ఈ-సిమ్‌తోనే కాల్స్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు సిమ్ లేకుండానే కాల్స్, సందేశాలు, మొబైల్ డేటాను వాడే టెక్నాలజీని తెచ్చాయి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా. మీరు కనుక ఎయిర్టెల్ యూజర్ అయితే మీరు ఈ-సిమ్‌ను దగ్గరలోని ఎయిర్టెల్ స్టోర్ నుండి పొందవచ్చు. అలాగే, మీరు మీ ఫోన్లో ఎయిర్టెల్ ఈ-సిమ్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.
ఎయిర్టెల్ ఈ-సిమ్ ని యాక్టివేట్ చేసుకోవడానికి, మీ సిమ్‌ను ఈ-సిమ్ గా మార్చడానికి మీరు ఎస్సెమ్మెస్ పంపాలి. మీరు మీ మొబైల్ నుంచి ఈ-సిమ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ (eSIMregistered email id) అని టైపు చేసి 121కు పంపాలి. మీరు ఇచ్చిన ఈ-మెయిల్ ఐడీ సరైందే అయితే మీకు 121 నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఒకవేళ, మీరు ఇచ్చిన ఈ మెయిల్ ఐడి సరైనది కాకపోతే మళ్లీ తిరిగి ప్రారంభించాలి.
మీరు 121 నుంచి వచ్చిన మెసేజ్ కు 60 సెకన్లలోపు ‘1’ అని టైప్ చేసి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న సంగతి మరిచిపోవద్దు. మిమ్మల్నిఇప్పుడు ఎయిర్టెల్ ఆఫీసర్.. క్యూర్ కోడ్ గురించి సంప్రదిస్తారు. అన్ని వివరాలు సమర్పించాక మీకు ఈ-మెయిల్ లో అధికారిక క్యూఆర్ కోడ్ వస్తుంది. మీరు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాక ఈ-సిమ్ రెండు గంటల్లో యాక్టివేటవుతుంది.
వొడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు తమ ఫోన్ ద్వారా ఈ-సిమ్ కోసం 199 నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపాలి. ఆ ఎస్సెమ్మెస్‌లో మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ పంపాల్సి ఉంటుంది. మీ మెయిల్ ఐడీ సరైందే అయితే, వొడాఫోన్ ఐడియా అధికారులు మిమ్ముల్ని సంప్రదిస్తారు. ఎయిర్‌టెల్‌లో మాదిరిగా క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వొడాఫోన్ ఐడియా ఈ-సిమ్ నంబర్ వచ్చేస్తుంది. మీ గుర్తింపు కార్డు, ఫొటోతో జియో యూజర్లు తమ సమీప జియో స్టోర్/ రిలయన్స్ డిజిటల్ లేదా జియో రిటైలర్ వద్దకు వెళ్లి మీ సిమ్ స్థానంలో ఈ-సిమ్ పొందొచ్చు.