న్యూయార్క్ : టెస్లాలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. కాలిఫోర్నియా కార్యాలయంలో పనిచేసే 229 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు కంపెనీ నిర్ధారించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్లకు ఇచ్చిన సమాచారంలో ఉద్యోగులపై వేటు విషయాన్ని ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం, ఎలన్ మస్క్ సారధ్యంలోని టెస్లా స్పష్టం చేసింది.
వీరంతా కంపెనీ ఆటోపైలట్ టీంలో పనిచేస్తున్న ఉద్యోగులు. శాం మెటియో, కాలిఫోర్నియా కార్యాలయంలో 276 మంది పనిచేస్తుండగా 229 మంది ఉద్యోగులపై టెస్లా వేటు వేయగా మిగిలిన 47 మందిని టెస్లా బఫెలో ఆటోపైలట్ కార్యాలయానికి పంపనుంది. ఉద్యోగాలు కోల్పోయిన వారంతా తక్కువ నైపుణ్యాలతో పాటు తక్కువ వేతనాలు పొందుతున్నారని టెక్‌క్రంచ్ రిపోర్ట్ తెలిపింది. ఈ ఏడాది ఆరంభంలో టెస్లాలో పది శాతం ఉద్యోగులను తగ్గిస్తామని మస్క్ ప్రకటించిన ప్రణాళికలో భాగంగా తాజా లేఆఫ్‌లను చేపట్టినట్టు టెక్‌క్రంచ్ రిపోర్ట్ పేర్కొంది.
మరోవైపు టెస్లా ఆటోపైలట్ విజన్ టీం సారధి, కంపెనీ ఏఐ డైరెక్టర్ అండరెజ్ కర్పధి కూడా ఎలాంటి కారణాలు వెల్లడించకుండా ఉద్యోగానికి రాజీనామా చేయడం కలకలం రేపింది. తాజా లేఆఫ్స్‌కు సంబంధించి మస్క్ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం చేరవేశాడు. ప్రపంచవ్యాప్తంగా నియామకాల ప్రక్రియను కంపెనీ నిలిపివేసిందని, ఆర్ధిక వ్యవస్ధ దారుణంగా ఉందని కూడా ఈమెయిల్లో మస్క్ ప్రస్తావించారు.