యౌవనంలో అందం రెట్టింపవుతుందని చెప్పడానికి ‘వయసొస్తే వంక పోతుంది’ అని పెద్దలు చెప్పే మాటే ఉదారహణ. ఆ ప్రాయంలో అందమే కాదు భావోద్వేగాలు, నిర్ణయాలు కూడా మారుతుంటాయి. హార్మోన్లలో కలిగే మార్పుల వల్ల చర్మం కూడా మారుతుంది. కొత్తగా వచ్చిన అందాన్ని జిడ్డు కమ్మేస్తుంది. వాతావరణంలో అధిక తేమ ఉండే వానాకాలంలో చర్మం మరింత జిడ్డుగా మారిపోతుంది. అందాన్ని చెరిపే ఈ జిడ్డుని తొలగించేందుకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మంచి ప్రయత్నమే అయితే ఫర్వాలేదు. కానీ, వికటిస్తే ఆ ప్రభావం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి జిడ్డు తొలగించుకునేందుకు, మొటిమలు అరికట్టేందుకు వానాకాలంలో కొత్త ప్రయోగాలకు సిద్ధమయ్యే ముందు టీనేజర్లు ఒకరి సలహా తీసుకోవాలి. చర్మాన్ని అందంగా ఉంచుకునేందుకు ఏ ఉత్పత్తి వాడినా, ఏ పద్ధతిని అనుసరించినా దాని వల్ల మేలుతోపాటు నష్టాలు ఏముంటాయో ముందుగా తెలుసుకోవాలి. ఏది మంచి, ఏది చెడు అనే సందిగ్ధంలో ఏదో ఒకటి చేయాలని తొందరపడకూడదు.
ఇలాంటి స్థితిలో.. ఏ నష్టమూ లేని ముల్తాని మట్టితో వారానికి రెండుసార్లు ఫేస్ ప్యాక్ చేసుకోండి. ఆల్కహాల్ లేని గ్రీన్ టీ టోనర్ ముఖంపై రాసుకుని పూడుకుపోయిన స్వేద రంధ్రాలను శుభ్రం చేసుకునేందుకు ప్రయత్నించండి. కలబందతో ఫేస్ ప్యాక్ చేసుకుంటే చర్మంలో తేమ పెరుగుతుంది. పగుళ్లను పోగొట్టి స్కిన్ టెక్చర్ని మెరుగుపరుస్తుంది. చర్మం మృదువుగా మారుతుంది. ఇవి పాటిస్తూ కొన్ని సాధారణ అలవాట్లకు దూరంగా ఉండే ప్రయత్నం కూడా చేయాలి. ఎక్కువసార్లు సబ్బుతో ముఖం కడగొద్దు. పదే పదే ముఖం కడగాల్సిన అవసరం వస్తే కొన్నిసార్లు సబ్బు లేకుండా నీళ్లతోనే శుభ్రం చేసుకోవాలి. దుమ్ముపట్టిన చేతులు, చెమట పట్టిన అరచేతితో ముఖాన్ని తాకవద్దు. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. చక్కెరలు అధికంగా ఉండే డ్రింక్స్, కొవ్వు అధికంగా ఉండే స్నాక్స్, వంటకాలకు దూరంగా ఉండాలి. ఈ పద్ధతులు అనుసరిస్తే హార్మోన్ల వల్ల చర్మంలో కలిగే మార్పులను తేలిగ్గా అధిగమించవచ్చు. అలాగే రసాయనాలుండే క్రీములు, జెల్స్ అవసరం రాకపోవచ్చు.