అమరావతి : ఏపీలో శాంతి భద్రతల ( Law and Order) పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు (YCP MLCs) మండలి సమావేశం నుంచి వాకౌట్ (Walkout) చేశారు. సోమవారం మండలి సమావేశం చైర్మన్ మోషెన్‌రాజు (Chairman Moshenraju) అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలపై వాడీవేడి చర్చ జరిగింది.
వైసీపీ ఎమ్మెల్సీ వరదు కల్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయని, ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు, హత్యల సంఖ్య పెరిగిందని ఆరోపించారు. వీటిని అరికట్టడంతో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు.
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ శాంతి భద్రతలు ఘోరంగా విఫలం అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేయగా హోంమంత్రి వంగలపూడి అనిత ( Home Minister Anitha) మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనను రాజకీయం చేయోద్దని కోరారు. దమ్ము, ధైర్యముంటే వైసీపీ పాలనలో తీసుకొచ్చిన దిశ చట్టం వల్ల ఎలాంటి మేలు జరుగలేదని, పైగా నేరాలు పెరిగిపోయాయని విమర్శించారు.
దమ్ము, ధైర్యం అనే పదాలు వాడినందుకు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టగా చివరికి అనిత క్షమాపణలు చెప్పారు. దిశ యాప్‌ను , దిశ పోలీస్స్టేషన్లను కొనసాగిస్తారా లేదా అంటూ వైసీపీ ఎమ్మెల్సీ కల్యాణి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హోంమంత్రి అనిత స్పందిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దిశ చట్టాన్ని, పోలీస్స్టేషన్లను ఎత్తివేశామని వెల్లడించారు. గతంలో కంటే నేడు రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గాయని పేర్కొన్నారు.