నాటుసారా విషయంలో ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులు చేస్తోంది. అక్రమ మద్యం, నాటుసారా చేస్తున్న వారిపై దాడులు చేస్తోంది. కేసులు కూడా నమోదు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ పరివర్తన్ 2.0 పేరుతో ఎస్ఈబీ విస్తృతంగా దాడులు చేస్తోంది. ఏపీ మొత్తంగా ఇప్పటి వరకూ నాటుసారా కింద 3,403 కేసులు నమోదు చేశామని స్పెషల్ బ్యూరో వెల్లడించింది. అంతేకాకుండా 2 వేల మందికి పైగా వ్యక్తులను కూడా అరెస్ట్ చేశామని అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు 44 వేల లీటర్లకు పైగానే నాటు సారాను స్వాధీనం చేసుకున్నామని, 150 వాహనాలకు పైగానే సీజ్ చేసినట్లు తెలిపారు. ఇక రాష్ట్రం మొత్తం మీద 17 మందిపై పీడీ యాక్టులు మోపామని అధికారులు తెలిపారు.
ఆపరేషన్ పరివర్తన్ 2.0 పేరుతో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఓ సారి దాడులు చేసిన విషయం తెలిసిందే. అక్రమంగా నాటుసారా కాస్తున్న వారు, నకిలీ బెల్లం, అక్రమంగా బెల్లం తయారీదారులపై బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేశారు. కేవలం కేసులే నమోదు చేయడం కాకుండా… వారికి కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. అయినా.. అక్రమంగా నాటుసారా తయారీ చేస్తూనే వున్నారని అధికారులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. అయితే కేవలం ఇదే వృత్తినే చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిని ప్రత్యేకంగా గుర్తిస్తున్నామని, వారికి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ, ప్రత్యామ్నాయ వనరుల గురించి వివరిస్తున్నామని అధికారులు తెలిపారు.