Duvvada Srinivas | దువ్వాడ ఫ్యామిలీ దుమారంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వర ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలు అనంత్‌బాబు, దువ్వాడ శ్రీనివాస్‌లను వైసీపీ నుంచి బహిష్కరించాలని సూచించారు. జగన్ నైతిక ధైర్యంతో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే వివాదాస్పద నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
మహిళల్లో చాలామంది రాజకీయ నేతల బాధితులుగానే ఉన్నారని డొక్కా మాణిక్యవరప్రసాదరావు అన్నారు. పార్టీలు కూడా అటువంటి నేతలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా స్పందించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటును వైసీపీనే గెలుస్తుందన్న వైవీ సుబ్బారెడ్డి.. కుటుంబ కలహాలకు ఎన్నికలకు సంబంధం ఉండదని తెలిపారు. వ్యక్తిగత అంశాలకు, రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు.
దువ్వాడ శ్రీనివాస్ వివాదం మెల్లిగా రాజకీయ రంగు పులుముకోవడంతో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆయన్ను తామెక్కడా విమర్శించడం లేదని తెలిపారు. తమను ఇబ్బందులు పెట్టిన వైసీపీ ముఖ్య నేతల పట్ల తాము కక్షపూరితంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు కావాలనే తమపై బురదజల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో తమను దోషులుగా చూపించాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు..