బాపట్ల జిల్లా : విధులకు హాజరుకాకుండా ప్రైవేటు పనుల్లో నిమగ్నమైన ఓ వైద్యుడిపై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి కఠిన చర్యలు తీసుకున్నారు. ఓ దవాఖానలో నకిలీ వేలు ముద్ర వేసి విధులకు హాజరవుతూ.. మరో చోట దర్జాగా ప్రైవేటు వెలగబెడ్తున్నట్లు గుర్తించి ఆయనపై సస్పెన్షన్ విధించారు. విధుల్లో ఉండాల్సిన వైద్యుడు ఎంతకీ రాడంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడంతో.. అక్కడికక్కడే సస్పెన్షన్ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.
బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని బల్లికురవ మండలం గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా భానుప్రకాశ్ పనిచేస్తున్నారు. మార్టూరులో ఈయనకు క్లినిక్ కూడా ఉన్నది. ఇక్కడ నకిలీ వేలుతో బయోమెట్రిక్ అటెండెన్స్ వేసి.. మార్టూరుకు వెళ్లి దర్జాగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాగా, శనివారం వైద్య, ఆరోగ్య మంత్రి విడుదల రజని గుంటుపల్లి పీహెచ్సీ తనిఖీ సందర్భంగా స్థానికులు వైద్యుడి గైర్హాజరు గురించి ఫిర్యాదు చేశారు. వైద్యుడు విధులకు రాకపోయినా ఇక్కడి సిబ్బందే ఆయన హాజరు వేస్తున్నారని తెలిపారు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి రజని.. వైద్యుడు భానుప్రకాశ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు.
మద్యం సేవించి రాత్రి విధులకు వస్తుండటంతో అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నామని గ్రామస్థులు మంత్రి విడుదల రజని దృష్టికి తీసుకెళ్లారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తారని, విధులకు సక్రమంగా హాజరుకారని స్థానికులు పెద్ద ఎత్తున మంత్రికి ఫిర్యాదు చేశారు. దాంతో ఆమె హాజరుపట్టికను పరిశీలించి ఎన్నిరోజులుగా భానుప్రకాశ్ విధులకు రావడం లేదని సిబ్బందిని ప్రశ్నించారు. వాళ్లు నీళ్లు నమలడంతో ఆయనకు వంత పాడటం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కూడా వేధిస్తారని అక్కడి ఏఎన్ఎంలు మంత్రికి ఫిర్యాదు చేశారు. దాంతో తక్షణమే ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి.. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు.