Medical employees | సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కదం తొక్కారు. పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఏపీ మెడికల్ & హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ జేఏసీ -పల్నాడు , వినుకొండ టీం ఆధ్వర్యంలో వినుకొండలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏఈ నాయకులు మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రజారోగ్య వ్యవస్థలో చాలీ చాలని జీతాలతో కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరంతరం సేవలందిస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని వారు కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్ జీతం అమలు, రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, పెయిడ్ మెడికల్ లీవ్స్, హెల్త్ కార్డుల మంజూరు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా, కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు తమ సంఘీభావం, మద్దతు కొనసాగుతుందని APNGOతో పాటు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ స్టేట్ వైస్ చైర్మన్ పి. శివరామకృష్ణ, జిల్లా చైర్మన్ నాగరాజు కుమారి, శాంతా రాజు, జాయింట్ సెక్రటరీ కోటేశ్వర నాయక్, స్టేట్ కోఆర్డినేటర్ సతీష్ పాల్గొన్నారు.