గుంటూరు : గుంటూరు నగరం కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.
‘కేసు దర్యాప్తులో పోలీసులకు స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని అందించారు.
హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షిస్తాం.
సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. యువతులు, మహిళలపై దాడులకు యత్నిస్తే కఠిన శిక్షలు తప్పవు. జరిగిన ప్రతి ఘటనను రాజకీయ కోణంలో చూడొద్దు. సమాజంలో జరుగుతున్న వికృత పోకడలను సమిష్టిగా ఎదుర్కోవాలి. ఘటన జరిగిన తక్షణం వేగంగా స్పందించి కేసును ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులకు అభినందనలు. విచారణ త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి సత్వరం కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు జారీ చేశాం. రమ్య హత్య అత్యంత దురదృష్టకరం’ అని డీజీపీ పేర్కొన్నారు.