Container farming | ఎక్కడైనా కూరగాయల పెంపకం చూడగానే మనకు కూడా ఇలాగే భూమి ఉంటే ఎంచక్కా ఇంటికి కావాల్సిన కూరగాయలను పండించుకునే వాళ్లం అనుకోవడం సాధారణం. అయితే, తోట పని మనం అనుకున్నంత ఈజీ కాదు. చాలా శ్రమ, సమయం కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో ఈ రెండే లేవు. ఫలితంగా చాలా మంది తోట పని అంటేనే అమ్మో అంటున్నారు.
మొక్కలంటే ప్రాణం.. కాని కేటాయించే సమయం లేక మీరు ఇబ్బంది పడుతున్నారా? అలాంటప్పుడు త్వరగా పెరిగి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే కూరగాయలను ఎంచుకోవడం శ్రేయస్కరం. మీ ఇంట్లోనే తాజా కూరగాయలను ఉత్పత్తి చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు. త్వరగా పెరిగే మొక్కల సమాచారం మీ కోసం..
ఆకు కూరలు
ఆకుకూరలు ఆరోగ్యపరంగా మనకు ఎంతో మేలు చేస్తాయి. తోటకూర, బచ్చలికూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలను ఇంటి వెనక గానీ, కంటైనర్లలో గానీ పెంచుకోవడం చాలా సులభం. ఇవి చాలా తక్కువ సమయంలో అందుబాటులోకి వస్తాయి. ఇంట్లో పండించుకోవడం వలన రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. ఈ ఆకుకూరలు 4 – 5 వారాలలో కోతకు సిద్ధంగా ఉంటాయి. నాణ్యమైన విత్తనాల చాలా ముఖ్యం. కంపోస్ట్ ఎరువులు ఉపయోగించాలి. నిత్యం నీరు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంటి పైనుంచి వృథాగా పోయే నీటిని ఈ కంటైనర్లకు మళ్లిస్తే మరింత ప్రయోజనంగా ఉంటుంది.
బేబీ క్యారెట్లు
క్యారెట్ వంటి కూరగాయలను నెల రోజుల వ్యవధిలోనే ఇంటి పెరట్లో సులభంగా పండించు కోవచ్చు. మట్టి నింపిన కంటైనర్లో బేబీ క్యారెట్ విత్తనాలను విత్తి.. దిగుబడి కోసం ఎరువులు వాడాలి. ఎక్కువ శ్రద్ధ అవసరం లేకుండానే క్యారట్ విత్తనాలు మొలకెత్తుతాయి. వీటికి 2, 3 రోజులు ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది. బేబీ క్యారెట్లు 30 రోజుల్లో కోతకు వస్తాయి.
కీర దోస
కీర దోస కూడా పెరగడానికి ఎక్కువ సమయం తీసుకోదు. అందుకే కంటైనర్లలో సీజన్ కూరగాయల మాదిరిగా సులువుగా పెంచుకోవచ్చు. దోసకాయ కూరగాయల కోసం ఎక్కువ స్థలం అవసరం ఉండదు. ఇంటి పైకప్పు తీగ పాకేందుకు ఉత్తమ మార్గం. దోసకాయ కంటైనర్లలో ట్రేల్లిస్ను కూడా ఉపయోగించడం వల్ల 3, 4 వారాల్లో ఉత్పత్తి మొదలవుతుంది.
వీటితో పాటు కుండీల్లో టమాట, వంకాయ, చిక్కుడు, పచ్చిమిర్చి వంటి కూరగాయాలను కూడా పెంచుకోవచ్చు. ఒక్కో పంట దిగుబడి మధ్య కొంత సమయం ఉండేలా చూసుకున్నట్లయితే.. నిత్యం తాజా కాయగూరలను మనం ఇంట్లో వాడుకునేందుకు వీలుంటుంది.