నేను పొలం దగ్గరే చిన్న షెడ్డు వేసుకొని బ్రాయిలర్ కోళ్లను పెంచుతున్నాను. అయితే, కొన్ని రోజులుగా కోడి పిల్లలు నీరసంగా కనిపిస్తున్నాయి. దాణా తినడం లేదు. ఈ సమస్య ఏంటి?
– ఎస్. రాజు, ఇబ్రహీంపట్నం.
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి.. కోడిపిల్లలు ఎస్కరీషియా కొలై అనే వ్యాధికి గురైనట్లు స్పష్టం అవుతున్నది. బ్రాయిలర్ కోడి పిల్లల్లో ఈ వ్యాధి తీవ్రంగా కనిపిస్తుంది. బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధికి గురైన కోడి పిల్లలు దాణా సరిగా తీసుకోలేవు. ఫలితంగా ఎప్పుడూ నీరసంగా ఉంటాయి. బరువు పెరగకపోవడం వల్ల నష్టం వాటిల్లుతుంది. వ్యాధి ముదిరితే పేగులు ఉబ్బిపోయి కోడి పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. దాణాతోపాటు నీటిలోనూ కలిపే యాంటీబయాటిక్స్ ద్వారా వ్యాధి సోకిన పిల్లలను కాపాడవచ్చు. కోళ్లకు సానిటైజర్ మందును ఇవ్వడం ద్వారా వ్యాధి రాకుండా నివారించవచ్చు.