ఆసిఫాబాద్, నవంబర్ 14: ఆసిఫాబాద్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధననందిస్తున్నారు. ఇక్కడే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు కూడా పంపిణీ చేశారు. చిన్నారులను మూడు విభాగాలు గా విభజించి ఆటాపాటలతో బోధిస్తున్నారు. నిత్యం ఒక ఆంగ్ల పదం, నెలకు ఒక ఆంగ్ల పద్యం నేర్పించేలా టీచర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకోసారి చిన్నారుల ప్రతిభకు తగినట్లుగా స్టార్స్ కేటాయిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం సహా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం, ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. మహిళా, శిశు సంక్షేమశాఖ అధ్వర్యంలో చేపట్టిన వినూత్న కార్యక్రమాల ఫలితంగా కాన్వెంట్లకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలు రూపుదిద్దుకున్నాయి. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలోని 5 ప్రాజెక్టుల పరిధి అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల బోధన అమల్లోకి వచ్చింది. కా న్వెంట్లకు వేలాది రూపాయలు వెచ్చించి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను అందించలేకపోతున్న తల్లిదండ్రులకు దీని ద్వారా మేలు చేకూరింది.
మూడు విభాగాలుగా..
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను మూ డు విభాగాలుగా విభజించి ఆటాపాటలతో కూడిన విద్యను అందిస్తున్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు ప్లాస్టిక్ బొమ్మలు, ఇతర ఆట వస్తువులు అందుబాటులో ఉంటాయి. 3 నుంచి 4 ఏండ్ల పిల్లలను ఎల్కేజీగా విభజించి, ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాల సహాయంతో ఆంగ్ల విద్యను బోధిస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్యతోపాటు చిత్రలేఖనం వంటి అంశాలపై కూడా పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు. 4 నుంచి 5 ఏండ్లలోపు చిన్నారుల కు పూర్వ ప్రాథమిక విద్యతో కూడిన ఆంగ్ల విద్యను అందిస్తున్నారు. ప్రతిరోజూ ఆర్ట్, క్రాప్టు, భాషా పరిచయం, నేను నా పరిసరాలు వంటి అంశాలను వివరిస్తున్నారు. నిత్యం వర్క్ బుక్లో పిల్లలతో హోం వర్క్ చేయిస్తున్నారు. ప్రైవేట్,ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు ఎలా నిర్వహిస్తారో ప్రస్తుతం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఇదే విధానం అమలు చేస్తున్నారు. సామర్థ్య పరీక్షల ప్రతిభ అధారంగా విద్యార్థులకు ప్రత్యేక గ్రేడ్లు కేటాయిస్తున్నారు. ప్రీ స్కూల్ పిల్లలకు మొత్తం ఆరు ఆంశాల ప్రాతిపదికన పరీక్షలు నిర్వహిస్తున్నారు. శారీరక, సామాజిక, వ్యక్తిగత, భావోద్వేగ, మేధోవికాసం, భాష,నేర్చుకునే రీతులు, బడికి సంసిద్ధత వంటి అంశాల ప్రాతిపదికన విద్యను అందిస్తున్నారు. టీచర్ పాఠాలు నేర్పిన తర్వాత చిన్నారులే స్వయంగా చేసి చూపితే మూడు స్టార్స్, టీచర్ లేదా ఆయా సహకారంతో చేస్తే రెండు స్టార్స్, ఈ విధంగా సామర్థ్య పరీక్షల ఫలితాలను ప్రతి మూడు నెలలకోసారి పిల్లల తల్లిదండ్రులకు అందిస్తున్నారు. కేంద్రాల్లో జరిగే ఈసీసీఈడే రోజున ప్రోగ్రెస్ కార్డును తల్లిదండ్రులకు చూపించి వారి సంతకాలు తీసుకుంటున్నారు. వెనుకబడిన చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
అంగన్వాడీ కేంద్రాలు కళకళ..
ప్రస్తుతం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు పిల్లలతో కళకళలాడుతున్నాయి. జిల్లాలోని ఆసిఫాబాద్, వాంకిడి, జైనూర్, కాగజ్నగర్, సిర్పూర్(టీ) ప్రాజెక్టుల పరిధిలో 973 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 834 ప్రధాన, 139 మినీ కేంద్రాలున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటిలో ఏడు నెలల లోపు పిల్లలు 4545 మంది.7 నెలల నుంచి ఏడాది వయస్సు పిల్లలు 5600, ఏడాది నుంచి మూడేళ్ల వయస్సు పిల్లలు 16718, మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసున్న 19,980 మంది పిల్లలకు కేంద్రాల్లో అనుబంధ పోషకాహారం, పూర్వ ప్రాథమిక విద్య, వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు అందిస్తున్నారు.
ఆదర్శ అంగన్వాడీల ఏర్పాటు..
చిన్నారులను మరింత ఆకట్టుకునే విధంగా ప్ర భుత్వం ఆదర్శ అంగన్వాడీ కేంద్రాలను తయా రు చేస్తున్నది. కేంద్రానికి ఆకర్షణీయమైన రం గులతో బొమ్మలు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తం గా ప్రస్తుతం 200 ఆదర్శ అంగన్వాడీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు.ఇప్పటికే కొన్నిచోట్ల పూర్తి కాగా, మరి కొన్ని చోట్ల పనులు నడుస్తున్నా యి. దీంతో పాటు నీతిఆయోగ్ పథ కం ద్వారా 279 అంగన్వాడీ కేం ద్రాల్లో మౌళిక సదుపాయలు స మకూర్చేందుకు ప్రభుత్వం రూ.3కోట్లు కేటాయించిం ది. పక్కా భవనాలకు మరమ్మతులు కొనసాగుతున్నాయి.
ఆటాపాటలతో విద్యనందిస్తున్నాం
చిన్నారులకు ఆటాపాటలతో కూడిన ప్రాథమిక విద్యతో పాటు ఆంగ్లంలో బోధిస్తున్నాం. అంగన్వాడీలను ఆదర్శ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రంగులు, బొమ్మలు ఆహ్లాదకరమైన వాతావారణం కేంద్రాల్లో ఏర్పాటు చేయడంతో పిల్లల వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య పెరుగుతున్నది.
-సావిత్రి, జిల్లా మహిళ, శిశు సంక్షేమాధికారి, ఆసిఫాబాద్