రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమైన బొడ్డెమ్మ వేడుకలు ఊరూరా ఘనంగా కొనసాగుతున్నాయి. బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. అంటూ వాడవాడనా ఆడబిడ్డలు సందడి చేస్తున్నారు. పితృ అమావాస్య వరకు వేడుకలు నిర్వహిస్తుండగా, చిన్నారులు, యువతులు, మహిళలు ఆడిపాడుతున్నారు. పిల్లల పండుగగా బొడ్డెమ్మను, పెద్దల పండుగగా బతుకమ్మను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుండగా, ఈ ఏడాదీ పల్లెపల్లెనా సందడి నెలకొంది.
మందమర్రి, సెప్టెంబర్ 21 : గ్రామాల్లో, కోల్బల్ట్ ఏరియాలో బొడ్డెమ్మల సందడి కనిపిస్తున్నది. గౌరీదేవి రూపంగా పూజించే బొడ్డెమ్మను నాలుగు రకాలుగా కొలుస్తారు. వాటికి పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ అని పేర్లు. ఈ బొడ్డెమ్మను పూజించి తొమ్మిది రోజుల తర్వాత చెరువులు, బావుల్లో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ లాగే బొడ్డెమ్మను పుట్టమట్టితో తయారు చేసి పూలతో అలంకరిస్తారు. వాకిళ్లలో అలుకు చల్లి ముగ్గు వేసి బొడ్డెమ్మను పెడుతారు. మహిళలు పూజలు చేస్తూ, ప్రత్యేక పాటలు పాడుతారు.
చిన్నారులతో పాటు మహిళలు, యువతులు ఉత్సాహంగా బొడ్డెమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఆనందడోలికల్లో మునిగి తేలుతున్నారు. ఆయా వీధులు, కూడళ్లలో ముగ్గులు వేసి మట్టి, పూలతో తయారు చేసిన బొడ్డెమ్మను ఉంచి పూజిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మకు ఒక్క రోజు ముందు వరకు ఈ వేడుకలు కొనసాగిస్తారు. అయితే, బొడ్డెమ్మ నిమజ్జనం తర్వాత వచ్చే అమావాస్యను పితృ అమావాస్య అంటారు. ఈ రోజు పెద్దలకు బియ్యం ఇస్తారు. ఆ రోజు నుంచే ఎంగిలిపూల బతుకమ్మ (చిన్న బతుకమ్మ) మొదలవుతుంది. మందమర్రి పట్టణంలోని ఒకటో జోన్, అంగడిబజార్, యాపల్, మేదరివాడ, శ్రీపతినగర్, దీపక్నగర్, ప్రాణహితకాలనీ, గాంధీనగర్ కాలనీల్లో వేడుకలు కొనసాగుతున్నా యి. కాగా, గోదావరి నదీ సమీప గ్రామాల్లో ఈ బొడ్డెమ్మను ఎక్కువ గా ఆడుతారు. చిన్నపిల్లలు ఆడితే బాలారిష్టాలు తొలుగుతాయని వారి నమ్మకం. ఐదు రోజుల పాటు ఈ వేడుకను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. బతుకమ్మకు ప్రతిరూపంగా బొడ్డెమ్మను కొలుస్తారు.
చిన్నప్పటి నుంచి ఆడుతున్నా..
నాకు బొడ్డెమ్మ ఆట అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి ఆడుతు న్నా. బొడ్డెమ్మ తర్వాత ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభం అవుతుంది. ఈ వేడుకల్లో చిన్నారులం, పెద్దలం, అందరం కలిసి సాయంత్రం పూట సరదాగా ఆడుకుంటాం. ఈ పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు కొనుక్కొవడం, ఇంట్లో రకరకాల పిండి వంటలు తయారు చేయడం లాంటి పనులతో బిజీబిజీగా ఉంటాం. పాఠశాలలు, కళాశాలలకు సెలవు రావడంతో దూరప్రాంతాల్లో చదువుతున్న స్నేహితులు కూడా వస్తారు. పండుగ సందర్భంగా వారిని కలిసే అవకాశం కూడా లభిస్తుంది. – సాటపురి నవ్య, మందమర్రి.
బొడ్డెమ్మ ఆటలంటే ఎంతో ఇష్టం
బొడ్డెమ్మ వేడుకలంటే ఇష్టం. మట్టితో తయారు చేసి రకరకాల పూలతో అలంక రించి మా స్నేహితులతో కలిసి ఆడుతాను. బొడ్డెమ్మ చరిత్రను పెద్దలు ద్వారా తెలుసుకునే అవకాశం లభిస్తున్నది. పిల్లలందరం బొడ్డెమ్మను తయారు చేస్తే ఇంట్లో పెద్దలతోపాటు కాలనీలో వివిధ వరుసలతో పిలుచుకుని పెద్దలు బొడ్డెమ్మ సంప్ర దాయాన్ని తెలుపుతారు. బొడ్డెమ్మను తయారు చేసి కాలనీలో ఒక చోట ఉంచి తొమ్మిది రోజులపాటు ఆడిపాడి చివరి రోజు నిమజ్జనం చేస్తాం.
– రామగిరి శ్రావ్య, మందమర్రి.
మాకు ఇది పెద్ద పండుగ
పెత్తరమాసకంటే ముందు వచ్చే బొడ్డెమ్మ సంబురాలు మహిళలకు పెద్ద పండుగ. తొమ్మిది రోజుల పాటు చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఆడిపాడుతరు. మట్టితో తయారు చేసిన బొడ్డెమ్మకు వివిధ రకాల పూలతో అలకరించి సంబురపడుతం. వాడవాడలా బొడ్డెమ్మ పండుగ వచ్చిందంటే చిన్నారులు ఎంతో సంతోషంగా కనిపిస్తరు. పూల పండుగ సంబురమంటే నాకైతే చెప్పలేనంత ఆనందం. తెలంగాణల ఆడబిడ్డలందరికీ బతుకమ్మే పెద్ద పండుగ. – రాసమల్ల మల్లీశ్వరి, మందమర్రి
పండుగ మొదలైంది..
బొడ్డెమ్మ ఆటలతో పండుగ మొదలైంది. చిన్నప్పుడు మా ఊల్లే దోస్తులందరితో కలసి బొడ్డెమ్మ ఆడేది. ఇప్పుడు కూడా అందరం ఆడుతున్నం. ఇది మన సంప్రదా యం. దీన్ని మర్చిపోలేం. నాకైతే చాలా ఇష్టం. ఇప్పు డు మా పిల్లలకు కూడా బొడ్డెమ్మ గురించి చెబుతున్న. మన పండుగలను మనమే కాపాడుకోవాలి. అందుకే పిల్లలకూ వీటిపై అవగాహన కల్పిస్తున్నం. ఇప్పుడు బొడ్డెమ్మ, తర్వాత బతుకమ్మ ఆడడం ఎంతో సంబురమనిపిస్తది. – అరిగెల పద్మ, మందమర్రి
సంబురాలు షురూ..
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బొడ్డెమ్మ వేడుకలు పెత్తర అమాసకు ముందు ప్రారంభమవుతాయి. బొడ్డెమ్మ ఆటలతో గ్రామాలు, పట్టణాల్లో బతుకమ్మ సంబురాలు ప్రారంభమవుతాయి. పెత్తరమాస్య తెల్లారి నుంచి తొమ్మిది రోజలు పాటు ఎంగిలి పూల బతుకమ్మ ఆడుతరు. బొడ్డెమ్మ వేడుకలతోటే బతుకమ్మ పండుగ సందడి షురూ అవుద్ది. బొడ్డెమ్మను పెట్టిన నాటి నుంచి ఉత్సాహంగా సద్దుల బతుకమ్మ వరకు చిన్నారులతో కలసి ఆటలు ఆడుతాం. మా అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ బతుకమ్మ. పిల్లలతో కలిసి బొడ్డెమ్మ ఆడడం కూడా ఎంతో సంతోషంగా ఉంది. – ఉప్పులేటి గోపిక, మందమర్రి.
బొడ్డెమ్మా.. బొడ్డెమ్మా కోల్..
బిడ్డాలెందారే కోల్..
నీ బిడ్డ నీలగౌరు కోల్..
నిత్య మల్లె చెట్టుకు కోల్..
..అంటూ పాటలు పాడుతారు. అనంతరం పప్పు, బెల్లం నైవేద్యంగా పెట్టి బొడ్డెమ్మను నిద్రపుచ్చుతారు.
——————————
బొడ్డెమ్మను నిద్రపుచ్చడానికి&
నిద్రపో బొడ్డెమ్మ.. నిద్రపోవమ్మా..
నిద్రకు నూరేండ్లు.. నీకు వెయ్యేండ్లు
నినుగన్న తల్లికి నిండు నూరేండ్లు జో..జో
——————————
..అంటూ పాడుతారు. తొమ్మిది రోజుల తర్వాత బొడ్డెమ్మను బావిలో నిమజ్జనం చేస్తారుజ చివరి రోజు కలశంలో పోసిన బియ్యాన్ని పరమాన్నంగా బెల్లం కలిపి ప్రసాదంగా స్వీకరిస్తారు.
బొడ్డెమ్మ పండుగ జరుపుకునే కాలంలో అనుములు, పెసర్లు, మొక్కజొన్నలు పండుతాయి. ఆ ధాన్యాల పేర్లన్నీ బొడ్డెమ్మ పాటల్లో కనిపిస్తాయి. శివుడు భార్యలైన గంగ, గౌరీల కలహాలు ప్రధానంగా ఉంటాయి.
——————————
మాలమర్తి మేడ మీద చందమామ..
వెండియ్య వేనగరలు చందమామ
వెండియ్య వేనగరలకు చందమామ
ఇత్తడియ్య చేరెలు చందమామ
ఇత్తడియ్య చేరెలకు చందమామ
రాగియ్య కడుపలు చందమామ
రాగియ్య కడుపలకు చందమామ
ముత్యాల ముగ్గులు చందమామ
ముత్యాల ముగ్గులకు చందమామ
వజ్రాల వాకిండ్లు చందమామ
వజ్రాల వాకిండ్లకు చందమామ
పవడాల పందిళ్లు చందమామ
పవడాల పందిళ్లకు చందమామ
మంచినీళ్ల బావి పుట్టె చందమామ
మంచినీళ్ల బావి పక్క చందమామ
మంచి మల్లె తీగె బుట్టె చందమామ
కోసే వారెవరు లేక చందమామ
కొండెత్తు పెరిగిపోయె చందమామ
ఆకు చిన్న అడవిలోనా
నాకు చన్న దండ గొరికె
అక్క రావే మనము గూడి ఆడుకుందామూ
ఆకుచాటు అరటిపండు అడిగెనేమో రాము మనసు
అడిగితేమి పంపుదాము
ఆజ్ఞ ఎందుకే కొమ్మచాటు నిమ్మపండు
కోరెనేమో రాము మనసు
కోరితేమి పంపుదాము
కోపమెందుకు బాయి చాటు పనస పండు
బ్రమిసెనేమో రాము మనసు
బ్రమితేనేమి పంపుదాము భాగ్యమెందుకు
ఊరివెనుక ఉల్లితోట ఒక్క దాన్ని ఉండ స్వామీ
ఒక్కదాన్ని ఉండ స్వామీ లక్కమేడల్లా
నాలుగోళ్ల పట్లె మంచం నట్టనడుమ నందదీపం
ఒక్కదాన్ని ఉండ స్వామీ లక్కమేడల్లా..