మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 14 : ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందించే పౌష్టికాహారం అధికారులు, కాంట్రాక్టర్ల ధన దాహంతో పక్కదారి పడుతున్నది. అంగన్వాడీల్లోని లబ్ధిదారుల సంఖ్యను బట్టి ప్రతి నెలా ఒక్కొక్కరికీ 30 కోడి గుడ్లు ఇవ్వాల్సి ఉండగా, ఇందులో సగం స్వాహా చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో నెలకు 15 గుడ్లనే సరఫరా చేసేవారు. రక్తహీనత నుంచి బయటపడడం కోసం వాటి సంఖ్యను 30కి పెంచారు.
ప్రతినెలా ఒకటి నుంచి ఐదో తేదీలోగా 15 పికాక్ బ్లూ కలర్ గుడ్లు, 16,17 తేదీల్లోగా మిగితా 15 రెడ్ కలర్ గుడ్లను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా రెండు విడుతలుగా వాటిని సరఫరా చేయాల్సి ఉండగా, గత మూడు నెలలుగా కొన్ని ప్రాంతాల్లో ఒకే విడుత సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇదేమని అడిగితే మిగిలినవి ఇంకా రాలేదని చెబుతుండడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో కోడిగుడ్ల ధరలు పెరగడంతో అధికారుల అండదండలతోనే వాటిని పక్కదారి పట్టిస్తూ అందినకాడికి దండుకుంటున్నాడనే ఆరోపణలున్నాయి.
జిల్లాలో గర్భిణులు, బాలింతలు, పిల్లలందరినీ కలుపుకొని మొత్తం 47,961 మంది ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికీ ప్రతినెలా 30 గుడ్ల చొప్పున సుమారు 11,65,690 (గర్భవతులు, బాలింతలు, మూడు సంవత్సరాలపైన వారికి – 8,53,530, మూడు సంవత్సరాలలోపు వారికి – 3,12,160 (19,510 మంది మూడేళ్లలోపు పిల్లలుండగా, వీరిలో ఒక్కొక్కరికీ ప్రతి నెలా 16 గుడ్లు మాత్రమే ఇస్తారు) గుడ్లు సరఫరా చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్ మాత్రం ఒకే విడుత మాత్రమే అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నాడు. ఈ లెక్కన నెలకు సగటున 5 లక్షలకు పైగా గుడ్లను సరఫరా చేయకుండా కాజేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో గుడ్డు ధర రవాణా చార్జీలు కలుపుకొని రూ. 5 చొప్పున లెక్కించినా.. ప్రతి నెలా లక్షలాది రూపాయల విలువైన గుడ్లను మింగేస్తున్నట్లు సమాచారం.
సంక్షేమశాఖ అక్రమాలకు నిలయంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు, బాలామృతంతో పాటు తదితర సరుకులు అందించాలి. కానీ ఇవేవీ సక్రమంగా అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కోడిగుడ్ల వ్యవహారంలో ప్రతినెలా లక్షల్లో చేతులు మారుతున్నట్లు సమాచారం. కాంట్రాక్టరు గుడ్లు సరఫరా చేయకున్నా అడిగే నాథుడే లేకుండాపోయాడు. అధికారులకు సైతం వాటాలు ముడుతుండటంతో చూసీచూడనట్లు వదిలేస్తుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ విషయమై జిల్లా సంక్షేమాధికారి కొట్టె చిన్నయ్యను వివరణ కోరేందుకు పలుమార్లు సెల్ఫోన్లో సంప్రదించగా లిఫ్ట్ చేయలేదు.
కోడిగుడ్లు నెలకు రెండుసార్లు రావాల్సి ఉంది. ఈ నెల ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు. ఐదో తారీఖులోపల రావాలే. మా మేడం వచ్చినప్పుడు పిలిచి మరీ ఇస్తుంది. ప్రతిరోజూ కోడిగుడ్డు ఇవ్వడం లేదు. సార్లు ఈ విషయాన్ని పట్టించుకోవాలి.
– అహ్మద్ బేగం, బాలింత, మజీద్ వాడ, మంచిర్యాల
మూడు నెలల సంది గుడ్లు సరిగ్గా రావడం లేదు. నెలలో ఏదో ఒక రోజు వస్తాయి. అందులో మాకు 10 కూడా సరిగా అందడం లేదు. మాకే కాదు చిన్న పిల్లలు, గర్భిణులకు కూడా వస్తలేవు. పెద్ద మేడమ్కు కూడా చెప్పినం. పై నుంచి రాకుంటే మేము ఏం చేస్తాం అంటున్నది. గిట్లతే మాకు పౌష్టికాహరం ఎట్లా ఇచ్చినైట్లెతది.
– షాహీన్, బాలింత, మంచిర్యాల