ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులను చలి వణికిస్తున్నది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీలు, మంచిర్యాలలో 10.9, ఆదిలాబాద్‌లో 11.7, నిర్మల్‌లో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యేటా డిసెంబర్, జనవరి మాసాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ రెండు నెలల్లో 5-10 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఈ యేడాది ముందుగానే నవంబర్ మూడో వారంలో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
– ఆదిలాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ)