సంతోషం ఎక్కడో బయట దొరికేది కాదు. ఎంత ఖరీదు పెట్టినా సరే కూరగాయల్లా దానిని బజారులో కొనుక్కోలేం. మన ఆలోచనల్లో, అలవాట్లలో, జీవనశైలిలోనే అది దాగి ఉంటుంది. దాన్ని ఎలా సంపాదించుకోవాలో చెప్పే జపాన్ దేశానికి చెందిన ఏడు సూత్రాలు ఈమధ్య బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ముఖ్యంగా ఇంటి పనులతో సతమతమవుతూ జీవితం అంటే ఇంతేనా? అని ఇటీవలి కాలంలో నైరాశ్యానికి గురవుతున్న గృహిణులతో పాటు ఇంటా బయటా ఒత్తిడికి లోనవుతున్న ఉద్యోగినులకు ఇవి మంచి పాఠాలుగా ఉపయోగపడతాయి. ఇందులో ఇకిగై మనం చేసే పనులకు ప్రేరణ ఇస్తే, కైజెన్ ముందుకు నడిపిస్తుంది. హరా హాచిబు, పొమొడోరో ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కింట్సుగి, వాబి-సాబి మనసుకు బలాన్నిస్తాయి. సెయిరి-సెయిటోన్ క్రమబద్ధతను నేర్పుతాయి. ఈ ఏడు జపాన్ సూత్రాలను రోజువారీ జీవితంలో కొద్దికొద్దిగా ఆచరిస్తే ప్రతి మహిళా.. తన జీవితాన్ని మరింత ప్రశాంతంగా, అర్థవంతంగా, ఆనందమయంగా మార్చుకోవచ్చు.
ఇకిగై – ప్రతి ఉదయానికీ ఒక అర్థం
ఉదయం లేవగానే ‘ఈ రోజు నేను ఎందుకు ఉత్సాహంగా ఉండాలి?’ అనే ప్రశ్నకు సమాధానమే ఇకిగై. చాలామంది మహిళలు తమ జీవితాన్ని కుటుంబ బాధ్యతలకే పరిమితం చేసుకుంటారు. అయితే తమకు ఇష్టమైన రచన, సంగీతం, తోటపని, సామాజిక సేవ, వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచుకోవడం వంటి ఏదో ఒక అంశాన్ని జీవిత లక్ష్యంగా ఎంచుకుంటే ప్రతి రోజూ కొత్త ఉత్సాహంతో మొదలవుతుంది. ఉద్యోగం చేస్తున్న మహిళకు తన పనిలోని సామాజిక ప్రయోజనం ఇకిగై కావచ్చు. గృహిణికి కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం లేదా తన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడం ఇకిగై కావచ్చు. జీవితానికి ఒక అర్థం కనిపించినప్పుడు ఒత్తిడి తగ్గి ఆత్మసంతృప్తి పెరుగుతుంది.
కైజెన్ – రోజుకో చిన్న అడుగు
కొత్త సంవత్సరం వస్తే పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం సులభం. కానీ, వాటిని కొనసాగించడం కష్టం. కైజెన్ మాత్రం రోజుకు ఒక చిన్న మార్పు చాలని చెబుతుంది. బరువు తగ్గాలంటే మొదటి రోజే గంట వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. రోజుకు పది నిమిషాల నడకతో మొదలుపెట్టవచ్చు. పుస్తకాలు చదవాలంటే రోజుకు రెండు పేజీలు చదివితే సరిపోతుంది. ఇలా చిన్నచిన్నగా మెరుగవడం వల్ల కొద్ది నెలల్లో పెద్ద ఫలితాలు వస్తాయి. మహిళలు తమ ఆరోగ్యం, ఆర్థిక నిర్వహణ, వృత్తి నైపుణ్యాల్లో ఈ సూత్రాన్ని అనుసరిస్తే ఆశ్చర్యకరమైన మార్పులను చూడగలరు.
హరా హాచి బు – ఆహార నియంత్రణ
ఇంట్లో అందరికీ వడ్డించి చివరగా తినే మహిళలు చాలామంది. కొన్నిసార్లు ఆకలి కంటే ఎక్కువ తినడం కూడా జరుగుతుంది. మిగిలిపోయిన ఆహారాన్ని పారేయకుండా, పొట్టలో వేసేవాళ్లూ చాలామందే. హరా హాచి బు సూత్రం ప్రకారం కడుపు పూర్తిగా నిండే వరకు కాకుండా సుమారు 80 శాతం నిండగానే భోజనం ఆపాలి. భోజనం నెమ్మదిగా నములుతూ తింటే త్వరగా తృప్తి కలుగుతుంది. ఇది బరువు నియంత్రణకు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులను దూరం పెట్టడానికి ఉపయోగపడుతుంది. ‘ఇంకో ముద్ద తినాలా?’ అనిపించినప్పుడు ఆగడం కూడా ఒక ఆరోగ్య అలవాటే.
పొమొడోరో – సమయానికి విలువ
మహిళల రోజు ఒకేసారి ఎన్నో పనులతో నిండిపోతుంది. పిల్లల సంరక్షణ, వంట, ఉద్యోగం, ఇంటి పనులు.. ఇలా అన్నిటినీ నిర్వహించాల్సి వస్తుంది. పొమొడోరో పద్ధతి ప్రకారం ఒకేసారి ఒక పనిపైనే పూర్తిగా దృష్టి పెట్టాలి. ఉదాహరణకు 25 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి ఒక పనిని పూర్తి చేయాలి. ఆ తర్వాత ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. మళ్లీ 25 నిమిషాలు పని చేసుకోవాలి. ఇలా చేస్తే పనులపై ఏకాగ్రత పెరుగుతుంది. రోజు చివరికి అలసట కూడా తక్కువగా ఉంటుంది.
కింట్సుగి – గాయాలను బలంగా మార్చుకో
జీవితంలో ప్రతి మహిళ ఏదో ఒక సమయంలో నిరాశ, వైఫల్యం, అనారోగ్యం లేదా వ్యక్తిగత నష్టాన్ని ఎదుర్కొంటుంది. కింట్సుగి తత్వం ప్రకారం పగిలిన పాత్ర విలువ కోల్పోదు; దాన్ని బంగారంతో అతికిస్తే మరింత ప్రత్యేకంగా మారుతుంది. అలాగే మన జీవితంలోని గాయాలు, కష్టాలు మనల్ని బలహీనులను చేయవు. వాటి నుంచి నేర్చుకున్న పాఠాలే మన వ్యక్తిత్వాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. విఫలమైన అనుభవాలను దాచిపెట్టకుండా వాటిని ఎదుగుదలకు మెట్లుగా మార్చుకోవాలని ఈ సూత్రం చెబుతుంది. కింట్సుగి పాత్ర పగుళ్లను దాచడానికి ప్రయత్నించదు. ఆ పగుళ్లే ఆ పాత్ర చరిత్రకు, అది ఎదుర్కొన్న కష్టాలకు గుర్తులు. బంగారం పూయడం ద్వారా ఆ గాయాలనే అత్యంత అందమైన భాగాలుగా మారుస్తుంది. భవిష్యత్తులో సాంకేతికత ఎంత పెరిగినా, మనుషుల్లో ఒత్తిడి, మానసిక ఆందోళనలు, బంధాలలో బీటలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి హైటెక్ యుగంలో కింట్సుగి ఒక గొప్ప ‘హీలింగ్ టూల్’ (వైద్యం)లా పనిచేస్తుంది. భవిష్యత్తులో రోబోలు, పర్ఫెక్ట్ అల్గారిథమ్స్ మనల్ని శాసిస్తున్నప్పుడు, మనలోని ‘లోపాలే’ మనల్ని మనుషులుగా నిలబెడతాయి. వైఫల్యాలను చూసి కుంగిపోకుండా, వాటిని బంగారు అనుభవాలుగా మార్చుకుని ముందుకు సాగడమే కింట్సుగి నేర్పే పరమార్థం. కాబట్టి మహిళలూ… పగుళ్లు పడిన జీవితాన్ని పారేయకండి, కింట్సుగితో దాన్ని ఒక అద్భుతమైన కళాఖండంగా మార్చుకోండి.
సెయిరి – సెయిటోన్..ఇల్లు శుభ్రం – మనసు ప్రశాంతం
అల్మరాల్లో, వంటగదిలో, మొబైల్లో, మన ఆలోచనల్లో కూడా అనవసరమైన విషయాలు పేరుకుపోతుంటాయి. సెయిరి అంటే అవసరం లేని వాటిని తొలగించడం. సెయిటోన్ అంటే మిగిలిన వాటిని క్రమబద్ధంగా అమర్చుకోవడం. నెలకు ఒకసారి ఇంట్లో ఉపయోగించని వస్తువులను తొలగించడం, పత్రాలను సక్రమంగా భద్రపరచడం, మొబైల్లో అవసరం లేని ఫైళ్లను డిలీట్ చేయడం వంటి చిన్న చర్యలు జీవితాన్ని తేలికగా మారుస్తాయి. క్రమబద్ధత పెరిగిన కొద్దీ మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది.
వాబి – సాబి – అసంపూర్ణతలోనే అందం
కాలం గడుస్తున్న కొద్దీ వస్తువులు పాతబడతాయి, మనుషులకు వయసు పైబడుతుంది, ముడతలు వస్తాయి. వాబి-సాబి ప్రకారం.. పాతబడటం అనేది అందవిహీనం కానే కాదు, అది కాలం మనకు ఇచ్చిన అనుభవాల గుర్తు. రాలిపోయే ఆకులోనూ, పాతబడిన గోడలోనూ ఒక తెలియని నిశ్శబ్దం, అందం ఉంటాయి. సోషల్ మీడియా కాలంలో ప్రతి ఒక్కరూ పరిపూర్ణంగా కనిపించాలనే ఒత్తిడిలో ఉంటున్నారు. కానీ వాబిసాబి జీవితం ఎప్పుడూ సంపూర్ణం కాదని గుర్తుచేస్తుంది. వయసుతో వచ్చే మార్పులు, చిన్న చిన్న లోపాలు, అనుకున్నట్టు జరగని పరిస్థితులు కూడా జీవితంలో భాగమే. ఇతరులతో పోల్చుకోవడం మానేసి, మనల్ని మనం అంగీకరించడం నేర్చుకున్నప్పుడు నిజమైన ఆనందం లభిస్తుంది. పరిపూర్ణత కోసం కాకుండా ప్రశాంతత కోసం జీవించమని వాబిసాబి సూచిస్తుంది. దీని ప్రకారం… పరిపూర్ణత అనేది భ్రమ; అసంపూర్ణతే సహజం. ఉదయం ఇల్లు కొంచెం చిందరవందరగా ఉన్నా, ప్రతి రోజూ అన్ని పనులు పూర్తికాకపోయినా, పిల్లల పెంపకంలో కొన్ని పొరపాట్లు జరిగినా ఏదో అయిపోయింది అనే ఒత్తిడిని వదిలేయాలని ఈ తత్వం సూచిస్తుంది. అలాగే శరీరాకృతిలో మార్పులు, ముఖం మీద ముడతలు లాంటివీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇది సలహా ఇస్తుంది. వీటిని లోపాలుగా భావించడం కంటే గౌరవంగా అంగీకరించే స్వభావమే వాబి -సాబి. ఈ సూత్రాలను చూస్తుంటే సంతోషానికి దారి వెతకడం సులభమే అనిపిస్తున్నది కదూ!!