Mirror at Home | అద్దం లేని ఇల్లు ఉండదన్న మాట నిజమే. కానీ ప్రస్తుతం అద్దాలతోనే ఏకంగా భవనాలు నిర్మించే స్థాయికి చేరుకున్నాం. అద్దాలను కళాత్మకంగా అమర్చితే.. మన ఇంటితోపాటు పరిసరాలూ కొత్తకాంతితో తేజరిల్లుతాయని అంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. డ్రాయింగ్ రూమ్, బెడ్ రూమ్.. ఇలా ఇష్టమైన ప్రదేశాల్లో అద్దాలను వేలాడదీస్తే ఆ వెలుతురుకు పరిసరాలు మరింత ఆకర్షణీయం అవుతాయి. కిటికీ ఎదురుగా అద్దం అమర్చితే సూర్యకాంతి ప్రసరించగానే నేరుగా ఇంట్లోకి వెలుతురు వచ్చేస్తుంది.
వార్డ్రోబ్, డ్రెస్సింగ్ రూమ్లో అమర్చేందుకు మెటల్ ఫ్రేమ్, క్లాసిక్ ఫ్రేమ్ అద్దాలు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. ప్రవేశ ద్వారాల వద్ద కూడా ఇప్పుడు అద్దాలను బిగిస్తున్నారు. అద్దాలు వాస్తుపరంగా శుభప్రదమైనవని ఓ నమ్మకం. చెడు దృష్టిని తొలగిస్తాయని చాలామంది విశ్వసిస్తారు. గదులను విడదీసేటప్పుడు ఇటుక గోడలకు బదులుగా అద్దాలను ఎంచుకుంటున్నారు. ఫలితంగా జాగా ఆదా అవుతున్నది. సీలింగ్ కోసమూ అద్దాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల గదిలో కాంతి రెట్టింపు అవుతుంది. గాజు పైకప్పు మధ్యలో వివిధ రకాల షాండిలియర్స్ను వేలాడ దీస్తే.. ఆ హుందాతనమే వేరు.