వివిధ బ్రాండ్ల విటమిన్ సప్లిమెంట్లు మెడికల్ షాపులలో సులువుగా అందుబాటులో ఉంటాయి. దాంతో, శరీరంలో ఏ కాస్త నీరసం కనిపించినా వెంటనే వెళ్లి ఏదో ఒక సప్లిమెంట్ తెచ్చుకుని వేసుకుంటాం. కానీ, విటమిన్ల మోతాదు మించితే ఆరోగ్యానికి ప్రమాదకరమని వివిధ అధ్యయనాల్లో తేలింది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల యునైటెడ్ కింగ్డమ్లోని ఓ హాస్పిటల్లో వైద్యులు సిఫారసు చేసిన దానికంటే ఏడురెట్లు ఎక్కువ విటమిన్-డి డోసు తీసుకోవడంతో ఓ వ్యక్తి మరణించాడు. పైగా అతనికి క్షయ, చెవిలో కణితి లాంటి ఇతర సమస్యలూ ఉన్నాయి. ఒక్క యూకేలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా జనం వేలంవెర్రిగా
విటమిన్-డి తీసుకుంటున్నట్లు అధ్యయనంలో తేలింది. విటమిన్లు శరీరానికి అత్యవసరమైన పోషకాలే కావచ్చు. విటమిన్-ఎ కంటిచూపును, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. విటమిన్-బి12 మెదడు, నరాల కణజాల అభివృద్ధ్దిలో ఉపకరిస్తుంది. ఇక విటమిన్-సి అయితే ఓ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్ తదితర ఖనిజ లవణాలను శరీరం శోషించుకోవడానికి విటమిన్-డి దోహదపడుతుంది. విటమిన్-ఇ అనేది చర్మం, కండ్ల ఆరోగ్యానికి, రోగ నిరోధక వ్యవస్థ నిర్మాణానికి సాయపడుతుంది. అయితే, విటమిన్ల మోతాదు మించితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రకమైన దుష్ప్రభావాన్ని హైపర్ విటమినోసిస్ లేదా విటమిన్ టాక్సిసిటీ అంటారు. సాధారణంగా వైద్యులు ప్రమాదం కాదనుకున్నంత మేరకే విటమిన్ సప్లిమెంట్లను సిఫారసు చేస్తారు. కాకపోతే శరీరానికు అవసరమయ్యే విటమిన్ల మోతాదు ఒక వ్యక్తికి మరో వ్యక్తికి వేర్వేరుగా ఉంటుంది. పైగా ఆయా వ్యక్తులకు ఉన్న ఆరోగ్య సమస్యలు శరీరంపై విటమిన్ల దుష్ప్రభావాన్ని మరింత జటిలం చేస్తాయి.
విష ప్రభావం
ఏది ఏమైనా రోజువారీ ఆహారానికి విటమిన్ సప్లిమెంట్లను జోడిస్తే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. వాటిలో శరీరానికి ఆవశ్యకమైన విటమిన్లు, మినరల్స్, మూలికలు, అమైనో ఆమ్లాలు, ఎంజైములు, ఇతర మూలకాలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఉపకరించేవే. ఉదాహరణకు రోజువారీగా మనం తీసుకునే విటమిన్-ఇ 15 మిల్లీగ్రాములకు మించకూడదు. కానీ, చాలా సప్లిమెంట్లలో ఆ పరిమాణం 100 నుంచి 1000 మిలీ ్లగ్రాముల దాకా ఉంటున్నది. విటమిన్-ఇ పరిమితికి మించి శరీరంలో పేరుకుపోతే, మెదడు సహా శరీర అవయవాల్లో రక్త స్రావానికి కారణమవుతుంది. ఇతర సప్లిమెంట్ల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఒక్కసారి శరీరంలో విటమిన్ టాక్సిసిటీ పెరిగిపోతే ఆ పరిస్థితి కొన్ని వారాలపాటు కొనసాగుతుంది. అలసట, తలనొప్పి, వాంతులు, చిరాకు, మూడ్లో హెచ్చుతగ్గులు లాంటి సవాలక్ష లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టే, రోగులను పరీక్షించాకే వైద్యులు విటమిన్ సప్లిమెంట్లను సూచిస్తారు. పోషకాహార నిపుణులు కూడా పండ్లు, గింజలు, కూరగాయల లాంటి సహజమైన విటమిన్ వనరులను సిఫారసు చేస్తారు. మరోదారి లేనప్పుడే కృత్రిమమైన మార్గాలు.
విటమిన్-ఎ
పాలు, గుడ్లు, చేపలు, టమాట, తాజా ఆకుకూరలు, మామిడి.
విటమిన్-బి12
జంతువుల కాలేయం, కిడ్నీలు, ఫోర్టిఫైడ్ ధాన్యాలు.
విటమిన్-సి
బ్రకోలి, స్ట్రాబెర్రీ, నిమ్మజాతి పండ్లు, బెల్ పెప్పర్, బ్లాక్ కరెంట్స్.
విటమిన్-డి
సాల్మన్ చేపలు, మాంసం, కాలేయం, గుడ్డుసొన.
విటమిన్-ఇ
బాదంపప్పు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి కాయ, పాలకూర, బఠాణీ.
విటమిన్-కె
కేల్ (క్యాబేజీ రకం మొక్క), మస్టర్డ్ గ్రీన్స్ (ఆవాల ఆకులు), తాజా చిక్కుళ్లు, బ్రకోలి, కోడి మాంసం, కివీ పండు, అవకాడో.