‘స్కేట్ బోర్డింగ్, రోలర్ స్కేటింగ్ అంటే ఇష్టపడేవారు చాలామందే ఉన్నారు. కానీ, అమ్మాయిలు నేర్చుకునేందుకు సురక్షితమైన వేదికలు లేవు. ఆ లోటు తీర్చేందుకే ఈ ప్రయత్నం’ అంటున్నది విద్యా గొల్ల. ఈ హైదరాబాద్ అమ్మాయి అమెరికాలో ఉంటున్నది. ఫిల డెల్ఫియాలో స్కేటింగ్ పాఠాలు నేర్చుకున్నది. అప్పట్లో స్కేట్ బోర్డింగ్ నేర్చుకునేవారిలో తానొక్కతే ఆడపిల్ల.
ఆ తర్వాత, న్యూయార్క్ వెళ్లింది. అక్కడ చాలామంది యువతులే కనిపించారు. ఫిలడెల్ఫియాలో స్కేట్ బోర్డింగ్ పట్ల ఆసక్తి ఉన్న మహిళల కోసం ఓ అకాడమీని స్థాపించింది. త్వరలోనే హైదరాబాద్‌లోనూ ఓ శాఖను ప్రారంభించాలన్నది ఆలోచన. ఆ ప్రయత్నంలో ఇటీవల స్కేట్ బోర్డింగ్ మీద అవగాహనా కార్యక్రమం నిర్వహించింది. విద్య మంచి చిత్రకారిణి. సృజనాత్మక రచయిత్రి. చాలా ప్రాజెక్టులకు కాపీరైటర్‌గా పనిచేసింది. సాహస యాత్రలకు సై అంటుంది. గ్రాఫిక్ డిజైనింగ్‌లో కోర్సు కూడా చేసింది.