మనసును మెలిపెట్టే బాధ నుంచి ఉపశమనం పొందడానికి ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటాం. కన్నతల్లిదూరమైన దుఃఖం నుంచి కోలుకోవడానికే తాను యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించానంటారు
హైదరాబాద్‌కు చెందిన సునీత. దాదాపు నాలుగేండ్ల క్రితం ‘ద తెలుగు హౌస్ వైఫ్’ పేరిట ఛానెల్‌ను ప్రారంభించారామె. పల్లెలో పెరగడం వల్ల తనకు మొదటి నుంచీ మొక్కలతో అనుబంధం ఉంది. అందులోనూ సునీత ముద్దుల కొడుకు వ్యవసాయశాస్త్రంలో పట్టభద్రుడు.
ఆ అనుభవాలన్నీ కలగలిపి టెర్రస్ గార్డెనింగ్ మీద ఫోకస్ చేశారు. దేశీ విదేశీ మొక్కలు ఎలా పెంచాలో, ఎలా దిగుబడి సాధించాలో వీక్షకులకు చెబుతారు. వృత్తిరీత్యా బ్యుటీషియన్ కావడంతో సౌందర్య చిట్కాలనూ పంచు కుంటారు. మంచి మంచి వంటలు కూడా నేర్పుతారు. బిడ్డ స్కేటింగ్ ఛాంపియన్ కావడంతో, టోర్నమెంట్స్ కోసం కూతురితో కలిసి వివిధ దేశాలు తిరిగారామె. ఆ విశేషాలను కూడా పరిచయం చేస్తారు. సాధారణ గృహిణి అయిన తాను వీడియోల ద్వారా ఎంతోమందికి చేరువ అయ్యాననీ, బయటికి వెళ్లినప్పుడు గుర్తుపట్టి మరీ పలకరించడం ఆనందాన్ని ఇస్తున్నదనీ చెబుతారు సునీత.