Telangana | ఎండపూట ఇంటికొచ్చిన అతిథికి చల్లనిచ్చే చల్లని సంస్కృతి తెలంగాణది. మాపటేలకు దూరపు బంధువు తలుపు తడితే అప్పటికప్పుడు దావత్ ఇచ్చే పెద్ద మనసు మనది. సాధారణ రోజుల్లోనే ఇలా ఉంటే.. పండుగో పబ్బమో వస్తే వంటింటి నుంచి రుచుల ఘుమఘుమలు వాడంతా వ్యాపిస్తాయి. దశాబ్ది వాకిట నిలిచిన తెలంగాణ సంబురంలో భాగంగా.. మనవైన పది పాకాలను గుర్తుచేసుకుందాం!
హైదరాబాద్ బిర్యానీ
మాటల్లోనే కాదు, పాకాల్లోనూ మనవాళ్లు ఇచ్చే దమ్కీకి ఎవరైనా గులాం అయిపోవాల్సిందే! దేశదేశాల నుంచి ఎవరు హైదరాబాద్ వచ్చినా దమ్ బిర్యానీ రుచి చూసి.. సలామ్ చేయాల్సిందే!
సర్వపిండి : తెలంగాణలో ఇంటింటా ఇష్టంగా తినే పిండి వంటకం సర్వపిండి. ఇంత వరిపిండి, అంత శనగపప్పు, కొన్ని ఉల్లిగడ్డలు ఇవే సర్వపిండికి సర్వస్వం. దీన్నే తపాలప్పలు అని ఆప్యాయంగా పిలుచుకునేవాళ్లూ ఉంటారు. తక్షణ ఆకలి తీర్చే సర్వపిండి విలక్షణ పిండి వంటకం!
మక్క వడలు : చిరుజల్లుల వేళ రెండు కంకులు కాల్చుకుని తింటే ఆ ఆనందమే వేరు! అయితే దీన్ని పదింతలు చేసే అద్భుతం మక్క వడ. ఓపికగా చేయాల్సిన పిండి వంటకమిది. కొలతల్లో కాస్త తేడా వచ్చినా పంటికీ, ఒంటికీ వడ దెబ్బ ఖాయం. బాగా కుదిరితే వేసిన వాయ వేసినట్టే వాయనం ఇచ్చినట్టు మాయమైపోవడం ఖాయం.
సకినాలు : సంక్రాంతి వేళ అందరి సంగతేమో కానీ, పెద్దమ్మకు పెద్దకష్టమే వచ్చిపడుతుంది. కారణం, సకినాలు! వాడలోని వారంతా సకినాలు సరసంగా చుట్టే పెద్దమ్మ చతురతకు ఫ్యాన్సే మరి! సకినాలు చుట్టడం చిత్రలేఖనం కన్నా కష్టం. వరిపిండిలో తగిన మోతాదులో నువ్వులు, ఓమా వేసి, పట్టు తప్పకుండా ఉండేవిధంగా నీళ్లు కలపడం అరచేతిలో అన్నపూర్ణ రేఖ ఉన్న అవ్వలకే సాధ్యం.
బగారన్నం : ముక్కుపుటాలను అదిరించి, జఠరాగ్నిని ప్రేరేపించే బగారన్నం తిండిపుష్టి కలవాడికి బంగారం కన్నా ఎక్కువే అనిపిస్తుంది. అందులోకి మటన్ కూర, బగారా బైంగన్ కుదిరితే మొదటి పంక్తి పూర్తయ్యేలోపే
పాత్రలు ఖాళీ!
పచ్చిపులుసు : నిమిషాల వ్యవధిలో సిద్ధమయ్యే పాకం పచ్చిపులుసు. ఉల్లిపాయ ఘాటు, కొత్తిమీర పరిమళం, బెల్లం తీపి, చింతపండు పులుపు కలగలిసిన ఈ పదార్థం జుర్రుకునేకొద్దీ రుచి.
నాటుకోడి పులుసు : ఎంత పాయిరంగ పెంచుకున్న కోడి అయినా సరే.. దగ్గరి సుట్టమొస్తే పులుసు కూర కావాల్సిందే. గసగసాలు.. మసాలాలు దట్టించి.. అల్లంవెల్లుల్లి పట్టించి వండే నాటుకోడి పులుసు
అతిథ్యంలో టాప్ వంటకం!
ముచ్చటైన రొట్టెలు : సత్తువిచ్చే సజ్జరొట్టె, కొవ్వును కరిగించే జొన్నరొట్టె, సత్వర శక్తినిచ్చే మక్కరొట్టె.. అందులోకి రోటిపచ్చళ్లు ప్రత్యేకం! ఆనపకాయ, చిక్కుడుకాయ, బీరకాయ కూరల్లోకి అద్దుకుంటూ రొట్టెలు తింటుంటే చూసేవాళ్లూ లొట్టలు వేయాల్సిందే!
తలకాయ కూర : మాంచి మేకపోతు, గొర్రెపొట్టేలు తలకాయ కూరంటే ఇష్టపడని వారు ఉండరు. రుచికి రుచి.. ప్రొటీన్స్కి ప్రొటీన్స్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. బగారన్నంలోకి తలకాయ కూర నంజుకుంటే స్వర్గం కండ్లముందుకు వచ్చేస్తుంది.
బోటీ ఫ్రై : బోటి పేగులను మటన్‌తో కలిపి వండకుండా.. సెపరేట్‌గా ఉడికించి వండుతరు. ముక్కలు తినలేని ముసలోళ్లు అడిగి మరీ బోటీ కూర వడ్డించుకుంటరు. బోటీ.. నాన్‌వెజ్ కూరల్లో మేటి అంటారు మాంసాహార ప్రియులు.