సాయంత్రం స్నాక్స్.. ఓ ఆరోగ్యకరమైన అలవాటు. అయితే, చాలామంది సూపర్ మార్కెట్లలో దొరికే బిస్కెట్స్‌నే ఎక్కువగా తీసుకుంటారు. వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అంతంత మాత్రమే! అందుకే, స్నాక్స్‌గా డ్రైఫ్రూట్స్‌ను తీసుకుంటే మంచిదని అంటున్నారు నిపుణులు. కనీసం 30 రోజులపాటు బిస్కెట్లను పక్కన పెట్టి.. ఓ గుప్పెడు నట్స్ తింటే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని చెబుతున్నారు.
బిస్కెట్లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నితిన్నా.. కడుపు నిండిన భావన ఉండదు. అదే, నట్స్ తిన్నప్పుడు.. అందులోని ఫైబర్, ప్రొటీన్ వల్ల కడుపు త్వరగా నిండుతుంది. దాంతో, ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా రోజూ తీసుకునే క్యాలరీల పరిమాణం తగ్గి, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరగడానికి సహాయపడుతుంది.
బిస్కెట్లలో మైదా, పంచదార ఎక్కువగా ఉంటుంది. అవి తిన్న వెంటనే శక్తి వచ్చినట్లు అనిపించినా.. అంతే వేగంగా బ్లడ్ షుగర్ పడిపోయి మళ్లీ నీరసంగా అనిపిస్తుంది. అదే నట్స్‌లో మంచి కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. దాంతో, నెమ్మదిగా, స్థిరంగా శక్తి విడుదలవుతుంది. దీనివల్ల సాయంత్రం వచ్చే నీరసం తగ్గుతుంది.
బిస్కెట్లలో ‘ట్రాన్స్ ఫ్యాట్స్’ (చెడు కొవ్వులు) ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు హాని కలిగిస్తాయి. అదే.. నట్స్‌లో ఒమేగా-3 లాంటి శరీరానికి మేలుచేసే ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండెను మరింత పటిష్టంగా మారుస్తాయి.
బిస్కెట్లలోని రిఫైండ్ షుగర్.. చర్మంపై మొటిమలు, ముడతల్ని పెంచుతుంది. కానీ, నట్స్‌లో ఉండే విటమిన్ ఇ, జింక్, యాంటి ఆక్సిడెంట్లు.. చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. కేవలం ఒక నెలలోనే చర్మాన్ని మరింత ఆరోగ్యంగా, కాంతిమంతంగా మార్చేస్తాయి.
బిస్కెట్లలోని మైదా వల్ల మలబద్ధకం వస్తుంది. అదే నట్స్ తీసుకోవడం వల్ల.. వాటిలోని పీచు పదార్థం పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తుంది.
నట్స్ ఆరోగ్యానికి మంచివే.. కానీ, అతిగా తినకూడదు. రోజుకు ఒక గుప్పెడు సరిపోతుంది. ఇక ఒకే రకమైనవి తీసుకోకుండా.. మిక్స్డ్ నట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. బాదం, పిస్తా, వాల్నట్స్, వేరుశనగలు.. ఇలా అన్నిటినీ కలిపి తీసుకోవడం మంచిది.
అందులోనూ మార్కెట్లో దొరికే సాల్టెడ్ (ఉప్పులో వేయించిన), మసాలా నట్స్ మాత్రం వద్దు. సహజమైన నట్స్ మాత్రమే ఎంచుకోవాలి.