కొందరిది జిడ్డు చర్మం. కొన్ని మొహాలకు బ్లాక్‌స్పాట్స్.అన్నీ బావుంటే సిన్ ఎలర్జీ.వందలాది సమస్యలు. వేలాది సౌందర్య ఉత్పత్తులు. ఆకర్షణీయమైన ప్యాకింగ్,ఊదరగొట్టే మార్కెటింగ్, సెలెబ్రిటీ ఎండార్స్మెంట్. దీంతో ఎంపిక ఓ సమస్యగా మారుతున్నది. కొన్నిసార్లు ప్రాణాంతకమూ అవుతున్నది. కృత్రిమ మేధ వంటి ఆధునికటెక్నాలజీతో ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టారు ‘అన్స్వీటెన్డ్ బ్యూటీ’ కో-ఫౌండర్ వైష్ణవీ రెడ్డి.
అందం కంటే ఆరోగ్యకరమైన చర్మమే చాలా ముఖ్యమని భావిస్తారు వైష్ణవీ రెడ్డి. తను హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్‌లో విద్యాభ్యాసం తర్వాత.. డేటా, బిజినెస్ ఎనలిటిక్స్‌కు సంబంధించిన సంస్థల్లో ఉద్యోగం చేశారు. మంచి జీతం. మంచి హోదా. మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లోని ఐఎస్బీలో అవకాశం వచ్చింది.. అప్పటికే స్టార్టప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్, ఉద్యోగాలు చేసిన అనుభవం ఉంది తనకు. కాబట్టే, అకడితో ఆగిపోలేదు. ఆంత్రప్రెన్యూర్షిప్కే ప్రాధాన్యం ఇచ్చారు. అప్పుడే, సౌందర్య సాధనాల గురించి అచ్చంగా తనలానే ఆలోచించే ఆర్తీ రేణు తారసపడ్డారు. ఐఎస్బీ ఆవరణలో మొదలైన స్నేహం.. బ్యూటీకేర్ టెక్ ప్లాట్‌ఫాం రూపకల్పన దిశగా ఆ ఇద్దరితో అడుగులు వేయించింది.
బ్యూటీకేర్ వ్యాపారం ఊహించని స్థాయికి చేరింది. దేశీయంగా 28 వేల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో మారెట్ రెండింతలు పెరిగి 40 బిలియన్ డాలర్లకు చేరడం ఖాయం. దీనికితోడు అంతర్జాతీయ బ్రాండ్లు చొచ్చుకొస్తున్నాయి. ఆ అపరిమిత అవకాశాలే.. ఆ ఇద్దరినీ ఏఐ ఆధారిత బ్యూటీకేర్ టెక్ సంస్థ ‘అన్స్వీటెన్డ్ బ్యూటీ’ నెలకొల్పేలా చేసింది. 2020లో మొదలైన స్టార్టప్ జర్నీ.. ప్రస్తుతం దేశీయంగా 50వేల మందికి సౌందర్య సాధనాల పట్ల సమాచారాన్ని అందిస్తున్నది. మరో ఆరు నెలలలో లక్ష మందికి చేరువకానుంది. అందరిలా క్రీమ్‌లు, లోషన్లు తయారు చేయడమో, డెర్మటాలజీ సేవలు అందించడమో కాకుండా.. సౌందర్య సాధనాలను టెక్నాలజీ ఆధారంగా ఎంపిక చేసుకునే వినూత్న వేదికను ఆవిషరించారు. ఏ రకం చర్మానికి ఎలాంటి క్రీమ్స్ వినియోగించాలి? మన్నికైన ఉత్పత్తులను ఎంచుకోవడం ఎలా? వాటి పనితీరుకు కొలమానం ఏమిటి? దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా? .. తదితర సందేహాలకు సమాధానాలు అందించే వేదికను సిద్ధం చేశారు. డేటా ఎనలిటిక్స్తోనే ఇదంతా సాధ్యం అవుతున్నది.
కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీతో పనిచేసే.. unsweetenedbeauty.com,instagram.com/unsweetened.beauty ద్వారా చర్మ లక్షణాలు, ఆరోగ్య వివరాలు, పేరు, వయసు, దీర్ఘకాలిక రుగ్మతలు తదితర వివరాలను ముందుగా నమోదు చేసుకోవాలి. అకడే, తాము వాడాలనుకుంటున్న ఉత్పత్తులను పేరొనాలి. ఆ వివరాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించి.. అందుబాటులో ఉన్న అత్యుత్తమమైన ఉత్పత్తులు, వాటి ధరలతోపాటు సమగ్ర సమాచారాన్ని బ్యూటీకేర్ టెక్ ప్లాట్‌ఫామ్ ‘అన్స్వీటెన్డ్..’ మన ముందు ఉంచుతుంది. దీనివల్ల వాణిజ్య ప్రకటనల వలలో పడిపోయే ప్రమాదం ఉండదు. పారితోషికాల కోసం వీడియోలు, ఫొటోలు షేర్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ల బెడద తప్పుతుంది. ఎంపిక శాస్త్రీయంగా, సులభంగా ఉంటుంది. డబ్బు వృథాను అరికట్టవచ్చు. దుష్ఫలితాలను దూరంగా ఉంచవచ్చు. చర్మ సౌందర్యానికి సంబంధించి నిపుణుల సలహాలు కూడా పొందవచ్చు. గర్భిణుల విషయంలో మరింత జాగ్రత్తగా సూచనలు ఇస్తారు. స్థానిక వాతావరణ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుంటారు. అదనంగా కస్టమర్స్ రేటింగ్ ఉంటుంది.
‘అన్స్వీటెన్డ్ బ్యూటీ’ ప్రారంభించిన రెండేళ్లలోనే విదేశీ పెట్టుబడులను సైతం ఆకర్షించింది. ఓ సింగపూర్ సంస్థ 5 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పటివరకు సిన్కేర్ సేవలను మాత్రమే అందిస్తున్నా.. హెయిర్, బాడీ కేర్, వెల్నెస్, సప్లిమెంట్స్‌కు పెరుగుతున్న ఆదరణ కారణంగా ఆ వైపుగానూ అడుగులు పడుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు ఓ మోస్తరు పట్టణాలకూ చేరువ కావాలన్నది తక్షణ ప్రణాళిక. రెండేళ్లలో మరింత దూకుడుగా అడుగులు వేస్తామని వైష్ణవి వివరించారు. ఈ వేదిక నైతికతతో కూడిన వ్యాపారానికి ప్రాధాన్యం ఇస్తుంది. జంతువులపై పరీక్షించిన ఉత్పత్తులకు ఇక్కడ చోటు ఉండదు. హానికర రసాయనాల మోతాదు ఎక్కువైనా సిఫారసు చేయదు.
‘బెంగళూరు తరహా ఇండస్ట్రీ ఎకో సిస్టం ఒక్క హైదరాబాద్‌లోనే ఉంది. ఎన్నో భారతీయ కంపెనీలు, అంతర్జాతీయ దిగ్గజాలు ఈ నగరం వేదికగా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. టీ హబ్, వీ హబ్ వంటి వేదికలు స్టార్టప్ కల్చర్ పెరిగేందుకు కృషి చేస్తున్నాయి. అదేవిధంగా బ్యూటీ కేర్ రంగంలోనూ హైదరాబాద్ వృద్ధి చెందుతున్నది. అందుకే హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను విస్తరిస్తున్నాం. ప్రతి సవాలూ మనకు ఒక అవకాశమే అని నమ్ముతాన్నేను. అందుకే, ఆంత్రప్రెన్యూర్‌షిప్ జర్నీలోని ప్రతి మజిలీ నాకు ఆనందాన్ని ఇస్తున్నది’ అంటారు వైష్ణవీ రెడ్డి.
– కడార్ల కిరణ్
-సి.ఎం. ప్రవీణ్