“రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే..’ శ్లోకం ద్వారా రాముడితో నా పరిచయం మొదలైంది. చిన్నప్పుడు అమ్మ ముందు కూర్చుని శ్రద్ధగా, శ్రావ్యంగా వల్లెవేసేదాన్ని. అదే ప్రగాఢ అనుబంధంగా మారింది. నృత్యకారిణిగా రాముడి పాత్ర ధరించిన ప్రతిసారీ.. నాలోనూ రాముడు ఉన్నాడన్న భావన కలుగుతుంది. ‘త్యాగరాజ రామాయణం’, ‘శ్రీరామ నామం ఎంతో రుచిరా’.. తదితర నృత్యరూపకాలు రామతత్వానికి నన్ను మరింత దగ్గర చేశాయి.
కంబోడియాలో జరిగిన రామాయణ ఉత్సవాల్లో ప్రదర్శన ఇవ్వడం మరచిపోలేని అనుభూతి” అంటారు ప్రముఖ నృత్యకారిణి ఆనంద శంకర్ జయంత్. రామాయణాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసే ఉద్దేశంతో రేపటి నుంచి ‘రామాయణ కల్పవృక్షం’ పేరుతో హైదరాబాద్లో మూడు రోజులపాటు ఉత్సవాలు జరుపుతున్నారామె. ఇందులో భాగంగా.. నృత్య ప్రదర్శనలు, ఉపన్యాసాలు, నగర సంకీర్తనలు ఉంటాయి. ‘రండి. రాముడిని అర్థం చేసుకోండి. రామాయణసారాన్ని గ్రహించండి. జీవితంలోని అనేక సంక్షోభాలకు ఆదికావ్యంలో పరిష్కారం ఉంది. సీతా
రాముల నడత, నడవడికలో జవాబు దొరుకుతుంది’ అని పిలుపునిస్తున్నారామె.