Sriya reddy | శ్రియారెడ్డి అచ్చమైన తెలుగమ్మాయి. పుట్టిపెరిగి, స్థిరపడింది చెన్నైలోనే అయినా…ఇప్పటికీ తన తెలుగు మూలాల్ని గౌరవిస్తుంది. తెలుగులో నేరుగా నటించడమే కాదు, ‘పొగరు’ లాంటి అనువాద చిత్రాలతోనూ ప్రేక్షకులకు పరిచయమైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ మంచి ఆదరణే అందుకున్నది. వెబ్ సిరీస్‌లలో మెరిసినా, ‘సలార్’తో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. ఆ ముచ్చట్లు..
ప్రాజెక్ట్ ఎంత పెద్దదైనా నేను వెంటనే ఒప్పుకోను. బాగా ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటాను. నటనకు అవకాశం ఉందా లేదా అనేది గమనిస్తాను. సలార్ విషయంలోనూ అలానే ఆలోచించాను. అంతమంది పెద్దనటుల మధ్య నాకూ తగినంత ప్రాధాన్యం ఉందని తెలుసుకున్న తర్వాతే ఒప్పుకొన్నాను.
‘అమ్మ చెప్పింది’ విడుదలైన పదహారేండ్లకు సలార్ ద్వారా తెలుగు చిత్రంలో కనిపించాను. తిరిగి నా మాతృభాషలో నటించడానికి సలార్ కంటే మంచి అవకాశం ఇంకేముంటుంది? స్విట్జర్లాండ్‌లోని ఓ చాక్లెట్ కెఫేలో ఉన్నప్పుడు ప్రశాంత్‌నీల్ నుంచి పిలుపు వచ్చింది.
మాది క్రికెటర్ల కుటుంబం. అందుకే ఫిట్‌గా ఉండేందుకు ఇష్టపడతాను. రోజూ కనీసం 20 నిమిషాల వ్యాయామం చేస్తాను. పార్టీలకు బదులు కుటుంబసభ్యులు, మిత్రులతో గడిపేందుకు ప్రయత్నిస్తాను. ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇస్తాను.
సలార్‌లో పాత్రోచితంగా వెండి నగలు ధరించాను. ఆ బరువుకు నా చెవులు వేలాడేశాయి. దీంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.