నగలను కళాత్మకంగా డిజైన్ చేయడం కాదు, కళలే సాక్షాత్తు నగలుగా మారిపోయాయి. మణి మాణిక్యాల స్థానాన్ని పెయింటింగ్స్ ఆక్రమించాయి. మహిళస్వతహాగా కళాభిమాని, సౌందర్య ప్రేమి. ఆపైన ఆభరణాలంటే ప్రాణమిస్తుంది.కాబట్టే, ‘ఆర్ట్ జువెలరీ’ మార్కెట్‌ను ఏలుతున్నది. జడపిన్నుల నుంచి కాలిమువ్వల వరకూ.. ప్రతి ఆభరణం ఏదో ఓ కళకు అద్దం పట్టేదే!
‘ఫొటో’ జువెలరీ
కళ తన పరిధిని విస్తరించుకుంటున్నది. కళాత్మక ఛాయాచిత్రాలు కూడా ఆభరణాలలో చోటు దక్కించుకుంటున్నాయి. నిశ్చితార్థం సందర్భంగా.. ఫొటోలతో కూడిన ఉంగరాలను మార్చుకోవడం నయా ట్రెండ్.
కుంచెలతో పన్లేదు. స్వచ్ఛమైన బంగారం ఉంటే చాలు. క్యాన్వాస్ అవసరమే లేదు. స్వర్ణకారుడి మనసే క్యాన్వాసుగా అవతరిస్తుంది. మొనాలిసా పెయింటింగ్ నుంచి రవివర్మ వర్ణచిత్రం వరకూ దేన్నయినా.. ఆభరణం మీద ఆవిష్కరిస్తున్నారు. ఆత్మీయుల బొమ్మలు ఉంగరం మీద వజ్రంలా మెరిసిపోవచ్చు. దేవీ దేవతల చిత్రాలు బ్రేస్లెట్లో ప్రత్యక్షం కావచ్చు. కళా ప్రపంచంలో నైరూప్య చిత్రాల స్థానం ప్రత్యేకం. దీంతో నైరూప్య డిజైన్లు కూడా జువెలరీలో భాగం అవుతున్నాయి.
హృదయావిష్కరణ
సాధారణ నగలు మహిళ ఆర్థిక స్తోమతను చాటుతాయి. కానీ, ఆర్ట్ జువెలరీ మగువ అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. డిజైన్‌ను బట్టి ఆమె కళాభిమాని అనో, చిత్రకారిణి అనో, గాయని అనో, వాద్యకారిణి అనో అర్థమైపోతుంది. కొన్నిసార్లు ఈ నగలు ఉద్వేగాన్నీ ఆవిష్కరిస్తాయి. యంత్రాలతో మనసును ఆవిష్కరించడం అసాధ్యం కాబట్టే, ఆర్ట్ జువెలరీ అచ్చమైన హస్తకళగానే మిగిలిపోయింది, శాశ్వతంగా నిలిచిపోయింది.
బంగారమే కాదు..
ఆర్ట్ జువెలరీలో బంగారం స్థానం బంగారానిదే అయినా.. గాజు, చెక్క, ప్లాస్టిక్, మట్టి మొదలైన వాటి వినియోగమూ ఎక్కువే. ఇత్తడి లాంటి లోహాలనూ విరివిగా వాడతారు. ఇక్కడ ధర కంటే.. వ్యక్తీకరణ ముఖ్యం, సృజనాత్మకత ప్రధానం. దీంతో చవకైన ముడిసరుకుతో మెరుపులు మెరిపిస్తున్నారు కళాకారులు. కాబట్టే వీటికి ‘స్టూడియో జువెలరీ’ అనే పేరూ వచ్చింది.