నిత్య జీవితంలో ఎన్నో చెల్లింపులు! కరెంటు బిల్లు కట్టాలి, సరుకుల డబ్బు పంపాలి, ఫుడ్ డెలివరీకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి.. ఇలా అనేక సందర్భాల్లో బ్యాంకు ఖాతాలోంచి డబ్బు వెళ్లిపోతూ ఉంటుంది. కానీ, ప్రతిసారీ ఆ చెల్లింపు 100, 500, 1000 రూపాయల రూపంలోనే ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నూట పదహార్లు, కొన్నిసార్లు ఐదువందలా పదిహేను రూపాయలు.. ఇలా చెల్లించాల్సి రావచ్చు. ఆ చెల్లింపులను నయాపైసలతో సహా కాకుండా.. ‘రౌండ్ ఫిగర్’గా మార్చి కాస్త అదనంగా తీసుకొని.. ఆ చిన్నచిన్న మొత్తాలను స్టాక్ మార్కెట్ పెట్టుబడిగా మళ్లిస్తున్నాయి కొన్ని స్టార్టప్స్. ఉదాహరణకు కరెంటు బిల్లు రూ. 1232 చెల్లించాల్సి ఉంటే, మన నుంచి రూ.1250 వసూలు చేస్తారు. ఆ పద్దెనిమిది రూపాయలనూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. సగటున మనం నెలకు యాభై అరవై లావాదేవీలు నిర్వహిస్తాం. ఆ చిల్లరంతా పోగై ఓ మోస్తరు మొత్తమే అవుతుంది. అది పెట్టుబడి రూపంలోకి మారుతుంది. లాభాల గుడ్లు పెడుతుంది. జార్ లాంటి మైక్రో ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ఈ తరహా ఆకర్షణీయమైన మార్గాల ద్వారా పెట్టుబడులను ఒక అలవాటుగా మారుస్తున్నాయి. ఇదే పద్ధతిలో బంగారం మీదా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇంటి చెల్లింపులన్నీ మహిళల చేతుల మీదుగానే జరుగుతాయి కాబట్టి, ఇల్లాలికి మంచి అవకాశం.